High Court CJ |
- విపత్తు నివారణ చర్యల్లో విఫలం
- హైకోర్టు సీజేకు లేఖ రాసిన హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్
- సుమోటొ పిల్‌గా స్వీకరించి విచారణ చేపట్టాలని వినతి
విధాత, హైదరాబాద్: రెండు రోజులుగా తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీ పరిధిలోని దామోదర సంజీవయ్య కాలనీకి చెందిన లక్ష్మి ఈనెల 4న మధ్యాహ్నం హుస్సెన్‌సాగర్ కాల్వలో పడి కొట్టుకు పోయింది. మరో ఘటనలో ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీకి చెందిన బాలుడు నితిన్ ఈనెల 5న నాలాలో పడి కొట్టుకుపోయాడు. దీనిపై ఇప్పటివరకు జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తెలంగాణ హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను పిల్‌గా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు. అనంతరం ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేసి ప్రజలను రక్షించాలని పిల్ లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటిస్తలేరు.
ఈనెల 4 తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ర్ట వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం, హైదరాబాద్ మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఎటువంటి జాగ్రత్తలు చేపట్టడంలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకే హైదరాబాద్ లో నాలాలో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా, అధికారులు మాత్రం వారిపట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఒకవైపు విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం ఆ నిబంధనలను అమలు చేస్తలేదని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడేండ్లుగా హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని నాలాలు, మ్యాన్‌హోల్స్ లలో పడి చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయ్యారని పేర్కొన్నారు. అటువంటి వార్తలు వివిధ తెలుగు, ఇంగ్లీష్ పత్రికలతోపాటు పలు టెలివిజన్లలో కూడా ప్రసారం అయ్యాయని, అయినా అధికారులు మారడం లేదని లేఖలో సూచించారు.
దయచేసి ఈ లేఖను సుమోటొ పిల్‌గా స్వీకరించి దీనిపై త్వరతగతిన విచారణ చేపట్టాలని కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయస్థానాల ఆదేశాలు పాటించి ఇలాంటి విపత్తుల నుంచి ప్రజలకు ప్రభుత్వం, మున్సిపల్ అండగా ఉండి వారి ప్రాణాలు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.