SC Collegium | తెలంగాణ, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ఎస్ వెంకటనారాయణ భట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకమయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇద్దరు న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ట్వీట్ చేశారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరింది.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఆ హైకోర్టు నేపథ్యం ఉన్న న్యాయమూర్తుల్లో సీనియర్. ఆ తర్వాత ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకయ్యారు. జూన్ 28, 2022 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తూ వస్తున్నారు.
సుదీర్ఘకాలం సేవలందిస్తున్న ఆయన.. న్యాయరంగంలో విశేష అనుభవం ఉన్నది. ట్యాక్సేషన్ లాలో స్పెషలైజేషన్ ఉన్నది. ఆయన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ట్యాక్సేషన్‌తోపాటు విభిన్నరంగాలకు సంబంధించిన కేసులను విచారించారు. ఆయన తీర్పుల్లో చట్టం, న్యాయానికి సంబంధించి విస్తృత కోణాలను స్పృశించారని, మంచి గౌరవం, నిబద్ధత, సమర్థత ఉన్న న్యాయమూర్తి అని ఇటీవల సుప్రీంకోర్టు సిఫారసులో అభిప్రాయపడింది.
జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి
కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ ఎస్‌వీ భట్టి ఏప్రిల్ 12, 2013 ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఆ సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు సీనియర్. 2019లో మార్చిలో సుప్రీంకోర్టు కొలీజియం ఆయనను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించింది. న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తిగా ఆయన న్యాయరంగానికి సంబంధించిన వివిధశాఖల్లో విస్తృత అనుభవాన్ని సాధించారు. విభిన్న కోణాలను స్పృశిస్తూ ఇచ్చిన తీర్పులు.. ఆయన చతురత, సామర్థ్యాన్ని చాటిచెబుతాయని, ఆయనకున్న అనుభవం, జ్ఞానంతో సుప్రీంకోర్టుకు అదనపు విలువను జోడిస్తుందని, ఆయనకు మంచి గౌరవం, నిబద్ధత, యోగ్యతలు ఉన్నాయని సుప్రీంకోర్టు సిఫారసుల్లో పేర్కొంది.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్యాంకోషి..!
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్యాంకోషి నియమిస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్జిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో సేవలందిస్తున్నారు. ఇంతకు ముందు ఆయనకు కొలీజియం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించింది.
అయితే, ఆయన మధ్యప్రదేశ్‌కు తప్ప ఎక్కడికైనా బదిలీ చేయాలని కొలీజియాన్ని కోరారు. దాన్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత తెలంగాణ హైకోర్టు సీజేగా నియామకం కానున్నారు. అయితే, అంతకు ముందు కర్ణాటక హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ అలోక్ ఆరాధేను తెలంగాణ హైకోర్టు సీజేగా కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
జస్టిస్ శ్యాం కోషీ 1967 ఏప్రిల్ 30న మధ్యప్రదేశ్‌లో జన్మించారు. జబల్‌పూర్ జీఎస్ కళాశాలలో డిగ్రీ చదివారు. జబల్‌పూర్‌లోనే ఉన్న రాణిదుర్గావతి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1991మార్చి 9 న మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2013 సెప్టెంబర్ 16న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకయ్యారు.