Site icon vidhaatha

మార్చి 9 త‌ర్వాత లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్.. ఆ రాష్ట్రాల అసెంబ్లీల‌కు కూడా..!

న్యూఢిల్లీ : జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ తేదీల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. లోక్‌స‌భ, ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ‌త కొన్ని రోజులుగా ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజ‌కీయ పార్టీలు, స్థానిక అధికారుల‌తో ఈసీ వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించింది. అనంత‌రం షెడ్యూల్‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. మార్చి 9వ తేదీ త‌ర్వాత లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు జాతీయ మీడియాలో ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

దేశ వ్యాప్తంగా లోక్‌స‌భ‌తో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీల‌కు ఈ ఏడాది మే నెల‌లోగా ఎన్నిక‌లు జ‌రాగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల‌తో పాటు జ‌మ్మూక‌శ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం భావిస్తోంది. ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో ఎన్నిక‌ల సంఘం స‌మావేశం కానున్న‌ట్లు స‌మాచారం. ఆ త‌ర్వాత ఈసీ బృందం జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ర్య‌టించి, ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించ‌నుంది. మొత్తానికి మార్చి రెండో వారంలో జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఆ ఏడాది మార్చి 10వ తేదీ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వ‌ర‌కు ఏడు ద‌శ‌ల్లో పోలింగ్ నిర్వ‌హించారు. మే 23న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు. ఈసారి కూడా ఏప్రిల్ – మే నెల‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించేలా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది.

Exit mobile version