Site icon vidhaatha

ఆరున్నర దశాబ్దాలైనా.. నెరవేరని సీమాంధ్రుల ఆకాంక్ష‌

విధాత‌: భాష ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్‌ 1న ఏర్పడిన ఆ రాష్ట్రం 1956 నవంబర్‌ 1న ఉనికి కోల్పోయింది. హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమై ఆంధ్రప్రదేశ్‌గా అవతరణ చెందింది. సీమాంధ్ర ప్రజలకు మొదట మద్రాస్‌, ఆ తర్వాత హైదరాబాద్‌ రాజధానిగా మారింది. కానీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు దక్కలేదు. ఆరున్నర దశాబ్దాలుగా సొంత రాజధాని కోసం ఎదురు చూస్తున్న సగటు సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను అక్కడి పాలకులు ఇప్పటికీ నెరవేర్చలేదు.

పాల‌కులు మారుతున్నా ప‌రిష్కారం లేదు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందంలో పేర్కొన్నఅంశాలు ఉల్లంఘనలకు గురవడం ఫలితంగా తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. అంతిమంగా 2014 జూన్‌ 2న తమ గమ్యాన్ని ముద్దాడారు.

ఆ సమయంలో సీమాంధ్ర ప్రజలకు రాజధాని నిర్మాణం అయ్యే వరకు పదేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. మాట్లాడితే నా అంత సీనియర్‌ లేడనే చంద్రబాబు ఐదేళ్ల పాలనలోనూ, నేను ఉన్నాను, విన్నాను, కన్నాను అని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మూడున్నరేళ్లుగా పాలిస్తున్నా ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఇప్పటికీ నెరవేరలేదు.

స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు ప్రాథాన్య‌మిస్తున్ననేత‌లు

విచిత్రమేమిటి అంటే నాడు విభజన పోరాట సమయంలోనూ, ప్రస్తుతం కూడా నేతల స్వప్రయోజనాలే తప్పా సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో పాలకులు విఫలమయ్యారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాజధాని అంటే రాజమౌళి సినిమా గ్రాఫిక్స్‌ అనే విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇక జగన్‌ హయాంలో పాలనా వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు. పాలనను ప్రజలకు దగ్గర చేయడానికి వికేంద్రీకరణ మంచిదే. కానీ తమ కంటూ ఒక రాజధాని కావాలనే సీమాంధ్ర ప్రజల ఆరున్నర దశాబ్దాల ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరకపోవడమే విషాదక‌రం.

Exit mobile version