విధాత, భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ (రామన్నపేట) మార్కెట్ కమిటీ పాలకవర్గం భర్తీ ప్రక్రియ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి సవాల్ గా తయారైంది. ఈ దఫా జనరల్ కేటగిరీలోకి మారిన వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఖచ్చితంగా ఓసీ (రెడ్ల)లకు ఇవ్వాలని మండల బీఆర్ఎస్ పార్టీలో పెద్ద నాయకులుగా ఉన్న ఓసి నాయకులంతా డిమాండ్ చేస్తున్నారు.
అయితే జనరల్ స్థానంలో కూడా బీసీ నేతకే చైర్మన్ పదవి కట్టబెట్టాలని ఎమ్మెల్యే పైళ్ల భావిస్తుండగా ఆయన నిర్ణయాన్ని మండలంలోని ఓసి వర్గం నాయకులంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. మండలంలోని ఓసీ వర్గం సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులంతా సోమవారం భువనగిరి దీప్తి హోటల్లో రహస్య భేటియై వలిగొండ మార్కెట్ చైర్మన్ భర్తీ వ్యవహారంలో ఎమ్మెల్యే పైళ్ల వైఖరిని తప్పు పట్టారు.
బీసీ రిజర్వుడు స్థానమైన పక్షంలో వారికే కేటాయించడంలో ఎవరికి అభ్యంతరం లేదని, వరుసగా రెండు సార్లు జనరల్ మహిళ స్థానంలో బీసీ మహిళకు చైర్మన్ గా ఎంపిక చేశారని, ఇప్పుడు జనరల్ స్థానంలోనైనా ఓసీలకు అవకాశం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అంటూ వారు ఎమ్మెల్యే పైళ్ల తీరును ప్రశ్నిస్తున్నారు.
వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాలకు చెందిన వలిగొండ,రామన్నపేట మండలాలు ఉన్నాయి. మొదటి నుండి కూడా వలిగొండకు చైర్మన్ పదవి, రామన్నపేటకు వైస్ చైర్మన్ పదవి కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల్లో కూడా రిజర్వేషన్ కల్పించారు. తొలుత ఏడాది కాల పరిమితితో బీసీ రిజర్వ్ డ్ గా ఉన్న వలిగొండ మార్కెట్ చైర్మన్ పదవికి దివంగత మారగొని జంగాల్ గౌడ్ ను ఎంపిక చేసి, పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు.
తదుపరి జనరల్ మహిళకు చైర్మన్ పదవి రిజర్వ్ చేయగా, కోణపురి కవితను తొలి ఏడాదికి చైర్మన్ గా నియమించి, మరో ఎడాది పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పుడు మారిన నిబంధనల మేరకు రెండేళ్ల కాల పరిమితితో చైర్మన్ పదవి జనరల్ స్థానం కిందకు రాగా, తదుపరి ఎస్టీలకు చైర్మన్ పదవి రిజర్వు కానుంది.
అయితే ప్రస్తుతం జనరల్ స్థానం పరిధిలో ఉన్న మార్కెట్ చైర్మన్ పదవిని ఓసీలకే ఇవ్వాలని ఈ విషయంలో ఎమ్మెల్యే పైళ్ల తన నిర్ణయం ప్రకటించాలని ఓసీల్లో ఎవరికి చైర్మన్ పదవి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని దీప్తి హోటల్లో భేటీ అయిన నాయకులంతా తీర్మానించుకున్నారు. తమ అభిప్రాయాన్ని ఎమ్మెల్యే పరిగణలోకి తీసుకొని పక్షంలో పార్టీ అధినాయకత్వానికి తమ సమస్యను విన్నవించాలని వారు నిర్ణయించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వలిగొండ మార్కెట్ చైర్మన్ పదవి ఎంపిక ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో అసమ్మతి సెగలను రగిలిస్తుంది. బీసీలకు వలిగొండ మార్కెట్ చైర్మన్ పదవి కట్టబడితే మండలంలో సీనియర్ నాయకులుగా ఉన్న ఓసీ నాయకుల అసంతృప్తిని ఎమ్మెల్యే ఎదుర్కొనక తప్పని పరిస్థితి కనిపిస్తుంది.
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ వీడిపోయిన నేపథ్యంలో నియోజకవర్గంలో బీసీ వర్గాలను మచ్చిక చేసుకునే క్రమంలో వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే పైళ్ల ఆలోచించారు. అయితే పైళ్ల తన రాజకీయ నిర్ణయానికి జనరల్ స్థానంలోని మార్కెట్ చైర్మన్ పదవి ఎంపికను పావుగా ఎంచుకోవడంతో ఆ వర్గాల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది.