Site icon vidhaatha

కాంగ్రెస్ సీనియర్ల రాజకీయ తంత్రం! రేవంత్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన సీనియర్లు.. తటస్థంగా జానా!

విధాత: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆది నుండి వ్యతిరేకిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు (Congress seniors)అవకాశం వచ్చినప్పుడల్లా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. రేవంత్ హఠావో కాంగ్రెస్ బచావో (Revanth Hathao Congress Bachao)అన్న సీనియర్లు రేవంత్ రెడ్డి పాదయాత్ర (Padayatra)కు జనం నుంచి వస్తున్న స్పందనతో కొందరు సీనియర్లు తాత్కాలికంగా రేవంత్ వ్యతిరేక వైఖరిని విడనాడి పాదయాత్రలో కనిపిస్తున్నారు.

శత్రువుకు శత్రువు తమకు మిత్రుడుగా…

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్లు మాత్రం రేవంత్ వైరాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంతకాలంగా తమలో తాము కలహించుకున్న సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar reddy), ఆర్. దామోదర్ రెడ్డి (Damodar Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) ఇప్పుడు రేవంత్‌తో వ్యతిరేకత నేపథ్యంలో శత్రువుకు శత్రువు తమకు మిత్రుడు అన్న తీరులో ఒక్కటై సాగుతున్నారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు రేవంత్ వ్యతిరేకంగా సీనియర్లలో నెలకొన్న ఐక్యతను వెల్లడిస్తున్నాయి.

MP ఉత్త‌మ్ ఇలాకాలో..

ఉత్తమ్ కుమార్ నిర్వహించిన పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ సమావేశంలో ఆర్ దామోదర్ రెడ్డి (Damodar Reddy) హాజరయ్యారు. రేవంత్ వర్గీయుడైన పటేల్ రమేష్ రెడ్డి ఈ సమావేశానికి హాజరైన ఆయన తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు.

జానారెడ్డి హాజరైనప్పటికీ ఆయన రేవంత్ కార్యక్రమాలకు కూడా హాజరై తన తటస్థ వైఖరిని.. పెద్దరికాన్ని పదిలం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో మిర్యాలగూడ, సాగర్‌లలో ఏదో ఒకచోట తన తనయుడికి టికెట్ సాధించుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఇకపోతే ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, పార్టీలో రేవంత్ వర్గీయుడిగా ముద్రపడిన చెరుకు సుధాకర్ గౌడ్ కు నెలకొన్న వివాదంలో వెంకటరెడ్డితో తమకెందుకు పంచాయతీ అన్నట్లుగా ఉత్తమ్, దామన్నలు సైలెంట్‌గా ఉండిపోయారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో…

ఇక దామోదర్ రెడ్డి పర్యవేక్షణలోని తుంగతుర్తి నియోజకవర్గంలో వడగళ్ల వాన పంట నష్టాన్ని పరిశీలించేందుకు వెంకటరెడ్డి పర్యటించగా ఆయనతో కలిసి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పరిణామాన్ని పార్టీ శ్రేణులు స్వాగతించాయి. అయితే ఇక్కడ కూడా రేవంత్ వర్గీయుడైన నియోజకవర్గం నేత అద్దంకి దయాకర్‌ను వెంకన్న, దామన్న దూరం పెట్టారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పర్యవేక్షణలోని కోదాడ , హుజుర్ నగర్ నియోజకవర్గాలకే పరిమితమై వచ్చే ఎన్నికల దిశగా తన ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దామోదర్ రెడ్డి తన సూర్యాపేట సెగ్మెంట్‌లో రేవంత్ వర్గీయుడైన పటేల్ రమేష్ రెడ్డితో, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌తో వర్గ పోరు చేస్తున్నారు.

వెంకటరెడ్డి తన పార్లమెంట్ పరిధిలో…

వెంకటరెడ్డి మాత్రం తన పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు, నకిరేకల్, మునుగోడుతో పాటు తన అసెంబ్లీ సెగ్మెంట్ నల్లగొండ, దేవరకొండ నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యక్రమాలలో, ప్రజా ఆందోళనలలో హాజరవుతూ పార్టీపై తన పట్టును నిలుపుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో రేవంత్ వర్గం పార్టీ నాయకులను మాత్రం సీనియర్లు ఉత్తమ్, దామోదర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తమ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారు. దీంతో రేవంత్ వర్గీయుల్లో సీనియర్ల పట్ల అసహనం వ్యక్తం అవుతుంది.

నియోజ‌క‌వ‌ర్గాల్లో కాన‌రాని పాద‌యాత్ర‌..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కోదాడ, హుజూర్ నగర్లలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రలు, సాగర్‌లో జానారెడ్డి పాద యాత్ర మినహా నియోజకవర్గాల్లో పాదయాత్రల సందడి కరువైంది. వెంకటరెడ్డి సొంతంగా తన పార్లమెంట్ పరిధిలో యాత్ర చేస్తానని చెప్పినా చివరికి ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా వెళుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొంటానని ప్రకటించారు.

సీనియ‌ర్లు ఒక్క‌టైన వేళ‌..

అసలు వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం మీదుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రవేశించాల్సిన రేవంత్ పాదయాత్ర జిల్లా సీనియర్ల వ్యతిరేకత నేపథ్యంలో నిజామాబాద్, కరీంనగర్‌లకు దారి మళ్ళింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ పాదయాత్రను వ్యతిరేకించిన సీనియర్లు ఉత్తమ్, దామోదర్ రెడ్డి, వెంకట్ రెడ్డి జిల్లా మీదుగా వెళ్లే భట్టి పాదయాత్రలో మాత్రం భాగస్వామ్యం అవుతామనడం గమనార్హం.

మొత్తం మీద రేవంత్ వ్యతిరేకత కారణంగా ఇన్నాళ్లు కలహించుకున్న జిల్లా కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్, వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి ఇప్పుడు రేవంత్ వ్యతిరేకత నేపధ్యంలో నైనా ఏకమైన తీరు జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో కొంతవరకు ఉత్సాహం రగిలించింది. అయితే నియోజకవర్గాల్లోని రేవంత్ వర్గం నేతలను సీనియర్లు కలుపుకోక పోతుండడంతో స్థానికంగా వర్గ పోరు మాత్రం సజీవంగానే ఉండిపోతుందన్న ఆందోళన కేడర్ ను నిరుత్సాహపరుస్తుంది.

Exit mobile version