విధాత, హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.
కాగా.. అస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకట్ రెడ్డి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో వెలుగు చూసిన విషయం తెలిసిందే. పార్టీని చూడవద్దని ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరారు.
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు విచారణ నిర్వహించి పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ కు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఏఐసీసీ క్రమ:శిక్షణ సంఘానికి సమాచారం ఇచ్చారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు పంపింది. ఈ నోటీసులపై వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.