Site icon vidhaatha

South Korea | పెళ్లిళ్ల సంఖ్య‌ను పెంచ‌డానికి.. ప్ర‌భుత్వ డేటింగ్

South Korea |

జ‌నాభా పెరుగుద‌ల ప్ర‌మాద‌క‌ర స్థాయిలో నెమ్మ‌దించిన నేప‌థ్యంలో ద‌క్షిణ కొరియా (South Korea) ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లకు దిగింది. వ‌రుస‌గా మూడేళ్ల నుంచి క‌నిష్ఠ జ‌న‌నాల రేటు త‌క్కువ‌గా న‌మోద‌వుతూ ప్ర‌పంచంలోనే అట్ట‌డుగు స్థాయిలో నిలిచింది. ఈ నేప‌థ్యంలో యువ‌త‌ను ఎలాగైనా పెళ్లిళ్ల వైపు ప్రోత్స‌హించాల‌ని ప్ర‌భుత్వ‌మే స్వ‌యంగా డేటింగ్ కార్య‌క్ర‌మాలు (Dating Shows) నిర్వ‌హిస్తోంది.

ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న న‌గ‌రాల సంఖ్య ఇటీవ‌ల పెరుగుతోంది. యువ‌తీ యువ‌కులు పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి త‌గిన ప‌రిస్థితులు సృష్టించాల్సిన బాధ్య‌త స్థానిక ప‌రిపాల‌కుల‌దేన‌ని సియోంగ‌మ్ మేయ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

త‌న న‌గ‌రంలో ఇలాంటి డేటింగ్ కార్య‌క్ర‌మాలు ఆయ‌న సుమారు 1,92,000 డాల‌ర్ల‌ను బ‌డ్జెట్‌లో కేటాయించ‌డం విశేషం. 29-39 ఏళ్ల మ‌ధ్య ఉన్న యువ‌తీ యువ‌కులు ఈ డేటింగ్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన కార్య‌క్ర‌మాల ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే.. కొన్ని న‌గ‌రాల్లో ఇవి అనుకూల ఫ‌లితాల‌ను ఇవ్వ‌గా.. మ‌రికొన్ని న‌గ‌రాల్లో ఆశించినంత‌గా ఫ‌లితాలు రాలేదు.

అయితే అస‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా ఇలాంటి డేటింగ్ కార్య‌క్ర‌మాల వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని కొంత‌మంది పెద‌వి విరుస్తున్నారు. పిల్ల‌ల్ని పెంచ‌డంలో మితిమీరిన ఖ‌ర్చులు, ఆకాశాన్నంటుతున్న‌ సొంతింటి ధ‌ర‌లు, అధిక ప‌ని గంట‌లు, త‌ల్లులైన యువ‌తుల ప‌ట్ల కార్యాల‌యాల్లో వివ‌క్ష మొద‌లైనవి యువ‌తను పెళ్లి వైపు ఆలోచించ‌నివ్వ‌కుండా చేస్తున్నాయ‌ని ద‌క్షిణ కొరియా నిపుణులు పేర్కొన్నారు.

వీటికి ప‌రిష్కారాల‌ను వెత‌క‌కుండా జ‌న‌నాల రేటును పెంచ‌లేమ‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. వీరే కాకుండా మ‌రికొంత మంది కూడా ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ఒక‌రికి పెళ్లి చేయాల‌ని ప్ర‌య‌త్నించే అధికారం ప్ర‌భుత్వానికి లేద‌ని వారు వాదిస్తున్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంతే…

వివాహాల రేటు, జ‌న‌నాల రేటు త‌గ్గిపోవ‌డం (Low Birth Rate) అన్న‌ది ప్ర‌పంచ‌వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పే. కాక‌పోతే ఇది ద‌క్షిణ కొరియాలో మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ఉంది. అమెరికాలో ప్ర‌తి 1000 మందికి ఆరు వివాహాలు జ‌రుగుతుండ‌గా ద‌క్షిణ కొరియాలో ఇది 3.8గా ఉంది. 2022లో జ‌న‌నాల రేటు క‌నిష్ఠంగా 0.78కి ప‌డిపోయింది. చైనా, జ‌పాన్ దేశాల్లో కూడా ప‌రిస్థితి కాస్త అటూ ఇటూగా ఇలానే ఉండ‌టం గ‌మ‌నార్హం.

Exit mobile version