విధాత : ఎండలకు బెంబేలెత్తుతున్న ప్రజలకు, వర్షపు చినుకోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు, వ్యవసాయంపైనే ఆధారపడిన సకల రంగాలకు భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. గత వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు (Monsoon) ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకినట్టు ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, ఈదురుగాలులు వీస్తూ, పిడుగులు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
ఇప్పటికి రుతుపవనాలు ప్రవేశించినా, అవి విస్తరించే స్వభావాన్ని అంచనా వేయడానికి కనీసం వారం పడుతుందని తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కేరళలో విస్తారంగా వర్షాలు కురిశాయని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు దట్టంగా ఆవరించి ఉన్నాయని పేర్కొన్నది. పశ్చిమ దిశగా వీచే గాలుల స్థాయి పెరిగిందని తెలిపింది.
రుతుపవనాల ప్రవేశం గడిచిన 20ఏళ్లలో ఎన్నడూ జూన్ 8 దాటలేదని తెలిపింది. కేరళ తీరంలోని 14 ఎంపిక చేసిన వాతావరణ కేంద్రాల్లో 60 శాతం అంటే 9 కేంద్రాల్లో రెండు రోజుల వ్యవధిలో కనీసం 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు ఆధారంగా రుతుపవనాల ప్రవేశంపై ఐఎండీ ప్రకటన చేసింది.
Southwest Monsoon has set in over Kerala today, the 08th June, 2023.
for more information: https://t.co/RlDbY8HDua#India #IMD #heatwave #weather #WeatherUpdate, @DDNewslive, , @ndmaindia, @airnewsalerts, @moesgoi pic.twitter.com/buYog1vHFS— India Meteorological Department (@Indiametdept) June 8, 2023
రుతుపవనాల ప్రవేశంతో నాలుగు నెలల వర్షాకాల సీజన్ ప్రారంభమయినట్టే. ఏడాది మొత్తంలో నమోదయ్యే వర్షపాతంలో 75 శాతం రుతుపవన సీజన్లోనే రికార్డవుతుంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపాజోయ్ తుఫాను కారణంగా ప్రస్తుతానికి వారంపాటు రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. సాధారణ పరిస్థితుల్లో రుతుపవనాలు జూన్ 10 నాటికి మహారాష్ట్రలో సగభాగం వరకూ విస్తరించి ఉండేవి. బిపాజోయ్ తుఫాను జూన్ 13 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నదని వాతావరణ విభాగం వెల్లడించింది.
ప్రస్తుతానికి ఇది గోవా నుంచి నైరుతి దిశలో 850 కిలో మీటర్ల కేంద్రీకృతమై ఉన్నది. మందగమనంతో సాగుతున్నది. దీని కారణంగా కేరళ నుంచి గుజరాత్ వరకు ఉన్న పశ్చిమ తీరం వెంబడి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ విభాగం వివరించింది. ఈ తుఫాను కారణంగానే నైరుతి రుతుపవనాలు దేశంలో విస్తరించడానికి ఆటంకం ఏర్పడుతున్నదని తెలిపింది.