కమనీయం.. రమణీయం లక్ష్మీనరసింహుల కల్యాణ మహోత్సవం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.

  • Publish Date - March 18, 2024 / 11:42 AM IST

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. అల వైకుంఠాన్ని తలపించేలా అద్భుత శిల్పకళా శోభితమై పునర్ నిర్మితమైన నూతన ఆలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల పర్వంలో వైష్ణవ పాంచరాత్రాగమశాస్త్రానుసారం స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.


యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున లక్ష్మీ నరసింహుల కల్యాణోత్సవానికి దేవాలయ కమిషనర్ హనుమంతరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ్ ఉత్సవ ఘట్టానికి ముందు స్వామివారికి రామావతారంలో హనుమంతు వాహన సేవ నిర్వహించి ఊరేగింపు నిర్వహించారు.


అనంతరం గజవాహనరూఢుడై పెళ్లికొడుకుగా ముస్తాబైన నరసింహుడిని, రత్న ఖచిత స్వర్ణాభరణాలు ధరించి ముత్యాల పల్లకిలో వేంచేసిన వధువు క్షీర సముద్ర తనయ లక్ష్మీ అమ్మవారిని కల్యాణ మండపంలో ఆసీనులు చేశారు . ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు, యజ్ఞాచార్యులు, అర్చక పండిత బృందం పాంచరాత్రాగమశాస్త్రానుసారం కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గరుడాళ్వార్ ఆహ్వానంతో కొండపైకి వేంచేసి విడిది చేసిన బ్రహ్మాది దేవతలు, సుర మునులు భక్తజనులు లక్ష్మీ నరసింహ కల్యాణ ఘట్టాన్ని వీక్షించి తరించారు.


గంగా, కావేరి, కృష్ణ, గోదావరి, యమున పుణ్య నదుల జలాల ఆవాహన, సంప్రోక్షణ, రక్షాబంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ, మధుపర్క నివేదన, నూతన వస్త్రాలంకరణ, జీలకర్ర బెల్లం ధారణ, కన్యాదాన ఘట్టాలతో అధ్యంతం కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహుల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు స్వామివారికి కాళ్లు కడిగి కన్యాదానం చేసే తంతును నిర్వహించారు. యజ్ఞిక పండితులు కల్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు బ్రహ్మ ముడులు వేసి భక్తుల గోవింద నామస్మరణల మధ్య మాంగళ్యధారణ ఘట్టం నిర్వహించారు.


అనంతరం తలంబ్ర ధారణ ఘట్టం సాగింది. స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించిన భక్తుల గోవింద నామస్మరణలతో కొండ పరిసరాలు మారుమోగాయి. కల్యాణోఉత్సవానికి హాజరైన భక్తజనంతో కొండ పరిసరాలు కిక్కిరిశాయి. అర్చక బృందం కళ్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు మంగళ నీరాజనాలు, ఆశీర్వచనాలు అందించాక గజవాహనంపై మాడవీధుల్లో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.


కల్యాణోత్సవంతో ఒకటైన స్వామి అమ్మవార్లు ప్రసన్నమూర్తులై భక్తులకు తమ దర్శనంతో అనుగ్రహించారు. తిరువీధుల్లో ఊరేగాక స్వామి అమ్మవారు తిరిగి ఆలయం చేరుకున్నారు. కల్యానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రంగుల విద్యుత్ దీప కాంతులతో యాదాద్రి పుణ్యక్షేత్రం సాక్షాత్ వైకుంఠ వైభోగాన్ని తలపించింది. బ్రహ్మోత్సవాల పర్వంలో రేపు మంగళవారము ఉదయం స్వామివారికి గరుడ వాహన సేవ, దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు.

Latest News