విధాత: మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే ఇక నుంచి మీ ప్రాంతీయ భాషల్లోనూ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. గతంలో ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ కేవలం హిందీ, ఆంగ్ల భాషల్లోనే నిర్వహించేవారు. కానీ ఇక నుంచి ప్రాంతీయ భాషల్లోనూ ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
హిందీ, ఆంగ్లంతో పాటు మరో 13 భాషల్లోనూ ఎస్ఎస్‌సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలుగు భాషలోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని గతంలో కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు. 2020, నవంబర్ 18న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయం విదితమే.
రైల్వేలు, డిఫెన్సు, బ్యాంకులు తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను, కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించడం సరికాదని, భిన్న భాషలున్న దేశంలో ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లోనే పరీక్షలు నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని మోదీని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌కు కేంద్రం స్పందించింది.
సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు, హిందీ ఇంగ్లీష్‌తో పాటు రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని, కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చొరవతో కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు, వారి వారి రాష్ట్రాల్లో జరిగే గ్రూప్ 1, 2, 3 ఎస్ఐ కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షల కోసం అయ్యే ప్రిపరేషన్, ఈ నిర్ణయం ద్వారా, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు కూడా ఎంతగానో ఉపయోగ పడుతుంది.