governor Tamilisai Soundararajan
విధాత: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ అంశంపై వివాదాన్ని పక్కన పెడితే.. కొంత కాలంగా రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య పొసగడం లేదన్నది బహిరంగ రహస్యమే.
రాజ్ భవన్ కేంద్రంగా గవర్నర్ మరో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గవర్నర్ చర్యలు ఈ విమర్శలకు బలం చేకూర్చుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యక్ష యుద్ధం మొదలు పెట్టిన దగ్గర నుంచి కేంద్రం, రాష్ట్రం మధ్య దూరం పెరిగింది.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం-రాజ్‌భవన్ మధ్య కూడా అంతేగ్యాప్ పెరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేసిందనేది అందరికీ తెలిసిందే.
ప్రస్తుత ప్రధాని మోడీ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గవర్నర్ జోక్యాన్ని నిరసిస్తూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ల వ్యవస్థను స్వతంత్రంగా పనిచేయగలిగేలా చూస్తే ఆయన చేసిన విమర్శలకు అర్థం ఉండేది.
కానీ.. తనదీ అదే దారి అని నిరూపించుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. గవర్నర్ల వ్యవస్థను అడ్డూ అదుపూ లేకుండా దుర్వినియోగం చేసిందన్న అపప్రథ మూటగట్టుకున్నది. తెలంగాణతో పాటు ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గవర్నర్లు బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని విమర్శలు బలంగా వ్యక్తమయ్యాయి. వారి చర్యలు కూడా అలానే ఉన్నాయి.
తెలంగాణలో..
గవర్నర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదని వాపోతున్న తమిళిసై.. నిజానికి తన అధికార పరిధిని మించి వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రజాదర్బార్ పేరుతో గవర్నర్ చేపట్టిన కార్యక్రమాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా తప్పుపట్టారు.
రాష్ట్ర శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లులు చట్ట రూపం దాల్చాలంటే గవర్నర్ ఆమోదం తప్పని సరి. వాటిపై తనకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరవచ్చు. ఆ బిల్లులు ఆమోదించడానికి తనకు ఉన్న అభ్యంతరాలను తెలియజేయవచ్చు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర సమాచారాన్ని కోరవచ్చు.
కానీ రెండోసారి రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లులను ఆమోదించకుండా ఆపే అధికారం గవర్నర్‌కు లేదు. ఈ విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నది. ఇది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌కు తెలియదని అనుకోలేం.
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అద్యాపకుల పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన బిల్లు రాజ్ భవనష్‌కు వస్తే.. దానిని గవర్నర్ ఆమోదించకుండా.. తనకు ఉన్న అభ్యంతరాలపై విద్యాశాఖ మంత్రి, అధికారుల నుంచి వివరణ కోరారు. మంత్రి, అధికారులు రాజ్ భవన్ కు వెళ్లి వివరణ కూడా ఇచ్చారు. అయినా ఇప్పటికీ ఆ బిల్లు గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉన్నది.
విచిత్రం ఏమిటంటే.. గవర్నర్ సదరు బిల్లును పెండింగ్‌లో పెడితే.. బీజేపీ నేతలు మాత్రం వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. నియామకాలలో ఆలస్యానికి గవర్నర్ కూడా కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న రాజకీయ విభేదాలకు, బిల్లులకు ముడిపెట్టి గవర్నర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవద్దని రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేకులు, సామాజికవేత్తలు కూడా కోరుతున్నారు. గవర్నర్ తన బాధ్యతలను రాజకీయాలకు అతీతంగా నిర్వర్తించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడితే ఎలాంటి సమస్య ఉండదు.
కానీ కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేయడం మాత్రం సరికాదంటున్నారు. ఇటువంటి కారణాల వల్లే రాజ్ భవన్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాజకీయ వివాదాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు.