విధాత: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఓ వింత శకటం ప్రత్యక్షమైంది. ఆదిత్య 369 సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటాన్ని వీక్షించేందుకు ప్రజలు తరలి వస్తున్నారు.
ఎక్కడి నుంచో వచ్చి పంటపోలాల్లో పడిన శకటాన్ని గ్రామస్తులు వింతగా చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చి పడిందోనని కొంతమంది గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. కాగా ఇది టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం అని, దీనివలన వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపినట్టు సమాచారం.
దీన్ని చూసిన గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దీనిని పరిశీలించి వివరించనున్నారు. అయితే ఇది ఆకాశంలోని స్పేష్ ష్టేషన్ నుంచి ఊడి పడి ఉంటుందని మరికొంత మంది అనుకుంటున్నారు.
అవి రీసెర్చ్ హీలియం బెలూన్లు.. ఏ ఇబ్బంది ఉండదు
ఇదిలాఉండగా ఆకాశంలో రీసెర్చ్ హీలియం బెలూన్లు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. వాతావరణంలో మార్పుల అధ్యయనాల కోసం బెలూన్లు పంపుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పంపినట్లు ప్రకటించారు.
రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6.30 వరకు ఆకాశంలో బెలూన్లు కనిపిస్తున్నాయి.ఈ బెలూన్లుఆకాశంలో 30 నుంచి 42 కి.మీ. ఎత్తువరకు వెళ్లి కిందికి చేరుతున్నాయి. హైదరాబాద్, విశాఖ,షోలాపూర్‌లో బెలూన్లు వదిలినట్లు పరిశోధకులు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఆకాశం నుంచి బెలూన్లు దిగాయి. ఈ బెలూన్ల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని పరిశోధకులు స్పష్టం చేశారు.