ఉన్నమాట: 2007లో తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి, మనపార్టీ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసిన కాసాని జ్ఞానేశ్వర్ తిరిగి ఆ పార్టీలో చేరడం వెనుక వ్యూహమేంటి? తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని చేపడుతున్న జ్ఞానేశ్వర్ రాజకీయ ఎత్తుగడలను పరిశీలిస్తే.. ఆయన చేరిక వెనుక పెద్ద వ్యూహమే ఉందని చెబుతున్నారు.
2001 నుండి 2006 వరకు టీడీపీ రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కాసాని పనిచేశారు. అదేవిధంగా 2007లో పది మంది తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు జ్ఞానేశ్వర్ ఎన్నికయ్యారు. అనంతరం తుళ్ల దేవేందర్ గౌడ్‌తో విభేదాల కారణంగా ఆయన తెలుగుదేశం పార్టీకి (TDP) రాజీనామా చేశారు.
2007 ఆగష్టులో మన పార్టీ పేరుతో తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాడు, 2009లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. కానీ 23430 ఓట్లు సాధించాడు. తరువాత, చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకుని 2009 సాధారణ ఎన్నికలలో చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 19996 ఓట్లు సాధించి ఓడిపోయారు.
2022లో ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు. ఈనెల 4న తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైనట్లు ప్రకటించారు, ఈ రోజు10 బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తెలంగాణలో కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు తెరవెనుక వ్యూహాలు భారీగానే చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ఖమ్మం, హైదరాబాద్‌లో కమ్మ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండటంతో లెఫ్ట్ నేతలతో కేసీఆర్ దౌత్యం కుదుర్చుకున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ-కేసీఆర్ మధ్య పొత్తు కుదిరినా ఆశ్చర్య పోనక్కరలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టే లక్ష్యంతో రాజకీయ సమీకరణలు చేస్తున్న కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌లు అన్నీ మర్చిపోయి, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారనే చర్చ మొదలైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో 2023 నవంబర్ ఎన్నికలకు టీఆర్ఎస్-వామపక్షాలు-టీడీపీ పొత్తు కుదిరే అవకాశాలు భారీగానే ఉన్నాయి.
ఇప్పటికే మునుగోడుతో పాటు, వామపక్షాలు ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో లెఫ్ట్ పార్టీలకు సీట్లు ఇవ్వాలని డిమాండుతోనే వామపక్షాలు టీఆర్ఎస్‌కు మద్దతిచ్చాయి. ఇక తెలంగాణలో దాదాపు 30కి పైగా నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే కమ్మ సామాజిక వర్గానికి కూడా కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగా అన్నీ మర్చిపోయి కేవలం 2023 ఎన్నికలకు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది.
అధికారం కోసం ఎప్పటికప్పుడు పొలిటికల్ చెస్ ఆడే కేసీఆర్, ఈసారి టీడీపీతో పొత్తు కలిసి వస్తుందని, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆశగా ఉన్నారు. కేసీఆర్‌తో పొలిటికల్ ఈక్వేషన్ సైట్ అయితే, సీట్ల కేటాయింపులో అటు వామపక్షాల మద్దతు, ఇటు టీఆర్ఎస్ క్యాడర్, తెలంగాణలో ఉన్న టీడీపీ బీసీ క్యాడర్ మద్దతుతో ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనే లక్ష్యంతో ఉన్నారు.
అందులో భాగంగానే మన పార్టీని క్లోజ్ చేసి, తిరిగి పాత గూటికి చేరారు. అయితే కేసీఆర్ రాజకీయ సమీకరణలపై కాసాని జ్ఞానేశ్వర్ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉండటంతో కాసాని అసెంబ్లీలో అధ్యక్షా అనే ఆశలు ఎంత వరకు నెరవేరుతాయో చూడాలి.