విధాత: రీసెంట్‌గా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఘటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి. టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లుగా చిరంజీవి ట్వీట్ చేశారు.
డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై రెండు నెలలుగా జుగుప్సాకరమైన రీతిలో లైంగిక దాడి చేస్తున్న.. అదే స్కూల్‌కి చెందిన ప్రిన్సిపల్ డ్రైవర్ రజినీ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Let such Horrors not recur ever again! pic.twitter.com/s1tzujCevh
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022
స్కూల్‌కి వెళుతున్న పాప రోజురోజుకీ బలహీనంగా కనిపించడంతో.. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని.. ఆ డ్రైవర్‌ను స్కూల్‌లో చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇప్పుడీ ఘటనపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘‘నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్‌లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సిసి కెమెరాల ఏర్పాట్లకు యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను’’ అని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఆ స్కూల్ గుర్తింపును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.