Site icon vidhaatha

వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి ఆకస్మిక బదిలీ.. రాజకీయ ఒత్తిడే కారణమా?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపిని ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలనే చాలా జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న గోపి విషయాన్ని అంతగా పట్టించు కోలేదు. మరి ఉన్నట్టుండి వరంగల్ జిల్లా కలెక్టర్ గోపీని ట్రాన్స్ఫర్ చేయడంలో ఏదో మతలబు ఉందని చర్చ సాగుతుంది. గోపి వరంగల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించబట్టి కూడా ఎక్కువ కాలమేమి కాలేదు. అయినా ఆకస్మికంగా బదిలీ చేయడం చర్చకు దారి తీసింది.

రాజకీయ ఒత్తిడే కారణమా?

జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కొందరి ఒత్తిడి మేరకే ఈ బదిలీ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పని విషయంలో కొంత నిక్కచ్చిగా వ్యవహరించే గోపి విధానం అధికార పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు పెద్దగా గిట్టనట్లు తెలిసింది. దీంతో తమ గోడును అధిష్టానం వద్ద వెళ్ళబోసుకున్నట్లు చెబుతున్నారు.

మొన్న హైదరాబాదులో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ప్రజాప్రతినిధుల ఉమ్మడి సమావేశంలో తమ ఇబ్బందులను ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులకు తెలియజేసినట్లు చెబుతున్నారు. వచ్చేవి ఎన్నికలు కావడంతో తాము చెప్పినట్లు వినే అధికారి ఉండాలనే అభిప్రాయాన్ని అధిష్టానం ముందు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి వ్యక్తం చేసినట్లు చర్చ సాగుతుంది.

ఈ కారణంగానే ఆకస్మికంగా గోపిని ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా పోస్టింగ్ ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో రిపోర్టింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కలెక్టర్‌గా ప్రావీణ్యకు అవకాశం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌ గా పని చేస్తున్న ప్రావీణ్యను బదిలీ చేసి వరంగల్​ కలెక్టర్‌ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్‌గా పని చేస్తున్న డా.బి.గోపీని హైదరాబాద్​లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రావీణ్య బదిలీతో ఖాళీగానున్న కమీషనర్ స్థానంలో మరొకరిని నియమించలేదు. నూతన కమిషనర్ ను నియమించే వరకు ప్రావీణ్య బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version