విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర స్వేచ్ఛా జాక్ ఇచ్చిన పిలుపులో భాగంగా వరంగల్, హన్మకొండ స్వేచ్ఛా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23 వ తేదీన కాళోజీ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించనున్నట్లు స్వేచ్ఛ జేఏసీ రాష్ట్ర కమిటీ కన్వీనర్, హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి డా.ఎస్.తిరుపతయ్య అన్నారు.
హన్మకొండ, వరంగల్ జిల్లాల భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ జాక్ నిర్వహించిన మీడియా సమావేశం శనివారం హనుమకొండలో జరిగింది. ఈ సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హేతువాద, నాస్తిక దృక్పథం గల టీచర్లు, అంబేద్కర్ వాదులు, మేథావులపై వరుసగా మూక దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
చిన్న విషయాలను పెద్దవిగా చేస్తూ, అబద్ధాలను, వక్రీకరణలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ తమ మత తత్వ రాజకీయాలకు అడ్డం అనుకునే సామాజిక కార్యకర్తలు, మేథావులపై సమాజంలోని అమాయక విశ్వాసులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారు. వరుస దాడులను బట్టి మతతత్వ శక్తులు దీన్నొక వ్యూహంగానే అమలు చేస్తున్నారని భావిస్తున్నాం.
మధ్య యుగాల నాటి ఈ చట్ట బాహ్య, మూక దాడుల సంస్కృతి సమాజానికి రెండు రకాలుగా ప్రమాదకరం. ఒకటి శాస్త్రీయ, హేతువాద, వైజ్ఞానిక భావజాలాన్ని మన దైనందిన జీవితానికి అన్వయించాలానే మేధావుల ప్రయత్నం అడ్డగించబడి మూఢ నమ్మకాలు, అశాస్త్రీయ భావజాలం సమాజంలో అప్రతిహతంగా పెరుగుతుంది.
రెండవది, భిన్నాభిప్రాయం వ్యక్తపర్చే స్వేచ్ఛను అన్ని దేశాలూ గౌరవిస్తున్నాయి. మన రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను అందరికీ ఒక హక్కుగా కూడా ఇచ్చింది. ఆ భిన్నాభిప్రాయం చెప్పే వారిపై ఆరోపణలు ఉంటే కూడా నాగరిక పద్ధతుల్లో వ్యవహరించాలి.
కానీ ఇలా ఆటవిక గుంపుల లాగా, మందిని పోగేసుకు వెళ్లి దాడులకు తెగబడటం అనే సంస్కృతి సమాజం ఇప్పటిదాకా సాధించిన నాగరిక విలువలకు గొడ్డలి పెట్టు. ఈ వికారమైన సంస్కృతి మన సమాజాన్ని తిరిగి మధ్య యుగాలకు తీసుకు వెళ్తుంది.
ఈ నేపథ్యంలో పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ఒక స్వేచ్ఛ JAC ఏర్పడి, అందుకోసం కృషి చేస్తున్న విషయం మీకు తెలిసిందే. క్రమంగా అన్ని జిల్లాలూ, పట్టణాల్లో కూడా ఈ రాష్ట్ర JAC కి అనుబంధంగా జిల్లా, నగర, పట్టణ JAC లు ఏర్పడుతున్నాయి.
అందులో భాగంగానే రాష్ట్ర స్వేచ్ఛ JAC కి అనుబంధంగా హన్మకొండ, వరంగల్ జిల్లాల స్వేచ్చా JAC ని భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలచే ఏర్పాటు చేశాము. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు పరిరక్షించాలని, మూక దాడులకు దిగేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనీ, ప్రజలందరూ మత తత్వ వాదుల వలలో చిక్కుకోకుండా చైతన్యవంతంగా ఉండాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో జేఏసీ భాగస్వామ్య పక్షాలైన సీపీఐ, సీపీఎంలు వాటి ప్రజా సంఘాలతో పాటు, దళిత, బహుజన సంఘాలూ, హేతువాద, నాస్తిక, వైజ్ఞానిక, సంఘాలూ, ఉద్యోగ, మహిళా, విద్యార్థీ, రచయితల మరియు హక్కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు .
సమావేశంలో బి.రమాదేవి, నల్లెల్ల రాజయ్య, పరికిపండ్ల వేణు,వేదాంత, బొట్ల చక్రపాణి, చుంచు రాజేందర్, గంగుల దయాకర్, పాణి, మంద సంజీవ, మామిడి సాగర్, యాకూబ్, చాపర్తి కుమార్, కేడల ప్రసాద్, కె.సురేందర్, మాదాసి సురేశ్, సయ్యద్ అదెల్ ఖాదీం తదితరులు పాల్గొన్నారు.