విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండమండలం వర్కట్ పల్లి గ్రామంలో రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరించే భూములను సర్వే చేయడానికి వచ్చిన తహసిల్దార్ గణేష్ నాయక్ ను, ఆర్ఐని, మండల సర్వేయర్లను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన నిరసనలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్ల కోసం గతంలో చేసిన అలైన్మెంట్ ను మార్చి తిరిగి చిన్న, సన్నకారు రైతుల భూముల పై నుండి రీ సర్వే చేసి వారి భూములను లాక్కోవడం దుర్మార్గమని వెంటనే పాత పద్ధతిలోనే అలైన్మెంట్ ను కొనసాగించాలని కొత్తగా చేసిన అలైన్మెంట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే , ఎంపీ లు ఇద్దరు భూ నిర్వాసితుల, రైతుల పక్షాన నిలవాలని, వారికి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వాలకు తెలియజేసి వారి యొక్క జీవనాధారమైన వ్యవసాయాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు. మార్పు చేసిన రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వల్ల అనేకమంది ఐదు ఎకరాల లోపు చిన్న, సన్నకారు రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వారికి ఎలాంటి జీవనాధారం లేకుండా పోతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో పునరాలోచన చేసుకొని వెంటనే అలైన్మెంట్ మార్చాలని, మండల స్థాయి అధికారులు రైతుల మనోవేదనను అర్థం చేసుకొని జిల్లా కలెక్టర్కు రిపోర్ట్ చేయాలని కోరారు.
కలెక్టర్ గ్రామానికి వచ్చి క్షేత్ర స్థాయి లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల కమిటీ నాయకులు మాడుగుల యాదగిరి, రైతులు సోలిపురం జనార్దన్ రెడ్డి, మెట్టు రవీందర్ రెడ్డి, నాగేల్లి దశరథ, బంగారు నరసింహ, మురళి, నాగేల్లి వెంకటయ్య, నాగేల్లి వెంకటమ్మ, నారి వెంకటేష్, నారి శ్రీకాంత్, మీసాల పద్మ, బంగారు యాదమ్మ, నాగేల్లి సరిత మెట్టు నర్శిరెడ్డి, సుధాకర్ రెడ్డి , బంగారు నర్సింహ, మైపాల్,, మీసాల శ్రీహరి, మాడుగుల వెంకటేశం, గంగాధరి జంగయ్య,నాగేల్లి వెంకటేష్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.