Liver Transplant | ప్రాణపాయ స్థితిలో ఉన్న తండ్రిని బతికించుకునేందుకు కూతురు తన కాలేయాన్ని దానం చేసింది. తాను మైనర్ కావడంతో కోర్టును ఆశ్రయించి, కాలేయ దానానికి అనుమతి పొందింది. తండ్రిని ప్రాణాలతో కాపాడుకున్న కూతురిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని కొలాజీకి చెందిన ప్రతీశ్(48) గత కొంతకాలం నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతనికి వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని చెప్పారు. లేనిపక్షంలో ఎక్కువ రోజులు బతకలేడని అతని కుటుంబ సభ్యులకు సూచించారు. అయితే కాలేయాన్ని దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తండ్రికి కాలేయాన్ని దానం చేసేందుకు 17 ఏండ్ల కూతురు ముందుకు వచ్చింది.
మైనర్ కావడంతో.. కోర్టును ఆశ్రయించి..
ప్రతీశ్ కుమార్తె దేవానంద(17) మైనర్ కావడంతో.. అవయవ దానం చేసేందుకు అనుమతి లేదని వైద్యులు చెప్పారు. దీంతో దేవానంద కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దేవానంద తన కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేయడం వల్ల ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణుల కమిటీ కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు అనుమతితో తన తండ్రికి తన కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేసింది. ఈ నెల 9వ తేదీన ప్రతీశ్‌కు సర్జరీ విజయవంతమైంది. తండ్రిని కాపాడుకోవాలనుకున్న కూతురి తపన చూసి.. ఆ సర్జరీకి అయిన ఖర్చును ఆస్పత్రి యాజమాన్యం మాఫీ చేసింది.