South Korea Tour |
విధాత బ్యూరో, కరీంనగర్: మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నేడు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తున్నారు. మంత్రులతో పాటు కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, రజత్ కుమార్, టూరిజం శాఖ ఎండీ తదితరులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం అధ్యయనం చేసేందుకు కొరియా, సింగపూర్ వెళ్లి రివర్ ఫ్రంట్ నిర్మాణాలను పరిశీలించి ఈ నెల 7న బృందం తిరిగి రానుంది.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కరీంనగర్ తొలి పర్యటనలో నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు నిజం అవుతున్నాయన్నారు.
నగరం రోడ్ల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు.
రాష్ట్రంలోనే రెండవ నగరంగా కరీంనగర్ అభివృద్ధి చెందిందన్నారు. మానేర్ నది రివర్ ఫ్రంట్ గా మారబోతున్నదని, రివర్ ఫ్రంట్ లో ఇప్పటికే ఇరవై శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. మరోఎనభై శాతం పనులు పూర్తి కావల్సి ఉందన్నారు. అగష్టు నెలలో బ్యారేజీలో నీటిని నింపుతామని వివరించారు. వంద కోట్లతో టూరిజం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
సౌత్ కొరియా యోసోలో ఉన్న ఫౌంటెన్ ను అధ్యయనం చేయడానికి తామంతా వెళ్తున్నామన్నారు.
యోసోలో ఉన్న సౌకర్యాలు, హంగులు కరీంనగర్ రివర్ ప్రంట్ లో తీసుకువస్తామన్నారు. ఆసియా లోనే టాప్ రివర్ ఫ్రంట్ గా కరీంనగర్ మానేర్ నదీ తీరం ఉంటుందన్నారు. రివర్ ఫ్రంట్ కరీంనగర్ కు ఒక అసెట్ గా కాబోతోందనే ఆశాభవం వ్యక్తం చేశారు.