విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన కృష్ణా జలాల హక్కుల సాధనకు ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 సమావేశంలో పోరాడుతామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. శనివారం నీటిపారుదల రంగనిపుణులు, న్యాయనిపుణులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ రవీందర్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు.
నది జలాల వాటా సాధనలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71 శాతం డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. రాష్ట్రానికి చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీరు కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ట్రిబ్యువల్ వద్ద తమ వాదనను బలంగా వినిపిస్తామన్న మంత్రి తెలిపారు.