Site icon vidhaatha

తెలంగాణ స్వేచ్చా గీతిక.. సెప్టెంబర్ 17

నిరంకుశం నుండి విముక్తి బావుటా ఎగిసిన దినం
విప్లవ పతాక..తెలంగాణ సాయుధ పోరాటం జ్వాల

విధాత, నల్లగొండ: సెప్టెంబర్17 తెలంగాణ సమాజానికి స్వాతంత్య్ర దినోత్సవ సంబురం. నిరంకుశ పాలనలో వెట్టి బతుకుల నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొంది ప్రజాస్వామిక స్వేచ్చా స్వాతంత్య్రం లను పొందిన దినం 1948 సెప్టెంబర్17 . అయితే భారత దేశం అంతా 1947ఆగస్టు 15 రోజునే పరాయి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొంది స్వయం పాలనలో సాగిపోతుంటే తెలంగాణ ప్రజానీకం మాత్రం తమ రాజుకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాల్లో మునిగి పోయింది. ఎందుకీ తేడా ఏమా చరిత్ర అంటే ఒక్కసారి తెలంగాణ చరిత్రలోకి పయనించాల్సిందే.

బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాం సర్కరోడా నాజీల మించినావురో అంటూ ..చుట్టూ ముట్టు సూర్యపేట నట్టనడుమ నల్లగొండ.. ఆ ప్రక్కన గోల్కొండ… గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడతాం కొడుకో నైజాం సర్కారోడో అంటూ పీడిత తెలంగాణ ప్రజలు సాగించిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాట ప్రస్థానంతో తెలంగాణ ప్రాంతం నిజాం రాజు నియంత పాలన నుంచి విముక్తి చెంది ఈ సెప్టెంబర్ 17వ తేదీతో 75 సంవత్సరాలు.

1948 సెప్టెంబర్ 13న అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు జనరల్ జే. యన్. చౌదరి నేతృత్వంలో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపై జరిపిన ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం (తెలంగాణ ప్రాంతం) సెప్టెంబర్ 17న నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగుబాటుతో భారతదేశంలో విలీనం అవ్వగా తెలంగాణ పౌరులు స్వేచ్ఛ స్వాతంత్రాలను పొందిన రోజుగా సెప్టెంబర్ 17 చరిత్ర పుటల్లో నిలిచింది.

అయితే తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి చెందిన సందర్భంలో సైనిక చర్య కంటే ముందుగా ఈ ప్రాంత ప్రజలు నిజాం ప్రభువు ఫ్యూడల్ పాలనను వ్యతిరేకిస్తూ నిజాం సేనలు, రజాకారుల అరాచకాలను ఎదిరిస్తూ ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు “సంగం” దళాల నేతృత్వంలో 4000 మంది పీడిత ప్రజల బలిదానంతో సాగించిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించక తప్పదు.

ఆనాటి తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానం పేరుతో అసఫ్ జాహి వంశీయుడు, ఏడవ నిజాం నవాబు మీరు ఉస్మాన్ అలీఖాన్ రాజ్యపాలనలో స్వతంత్ర రాజ్యాంగ కొనసాగుతుండేది. అప్పట్లో దేశంలోని 600 సంస్థానాలలో హైదరాబాద్ అతిపెద్దది. తెలంగాణ, మహారాష్ట్ర ,కర్ణాటక ప్రాంతాల్లోని 16 జిల్లాలతో 40 వేల చదరపు మైళ్ల విస్తరించి 164 లక్షల జనాభా ఉండేది.

అందులో సగం తెలుగు వాళ్ళు ఉండగా, 20 లక్షల మంది వరకు ముస్లింలు ఉండేవారు. అయినా అధికార భాషగా ఉర్దూ కొనసాగుతుండగా, ఇతర భాషలకు ప్రాధాన్యం లేదు. ప్రభుత్వ ప్రధాన ఆదాయం భూమిశిస్తూ, నిజాం రాజ్యానికి సొంత సైన్యం, పోలీస్ వ్యవస్థ, రోడ్లు జైళ్లు, సొంత చట్టాలు ఉన్నాయి. నిజాం పోస్టల్ స్టాంప్, నిజాం సొంత కరెన్సీ సిక్క, హైదరాబాద్లో రెసిడెంట్ పేరుతో బ్రిటిష్ రాయబారి, ఢిల్లీ నవాబు ప్రతినిధి ఉండేవారు.

దాదాపు 400 సంవత్సరాలు నిజాం ప్రభువుల ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం అంతా సాయుధ పోరాటం సమయంలో నిజాం ప్రభువుల బంధువులు, జాగిర్దారులు దేశ్ ముఖ్ లు, దేశ్ పాండేలు, దొరలు, జమీందారులు, పట్వారి, పటేళ్ల పెత్తనం కింద మగ్గి వారు సాగించే దోపిడి దౌర్జన్యాలతో అణగారిన కులాలు, వృత్తుల ప్రజలు వెట్టిచాకిరి బానిసలుగా తమ ధన మానప్రాణాలు ఏలికల దయా బిక్షగా పీడిత వర్గాలుగా బ్రతుకులు వెలదీస్తున్న సామాజిక దుస్థితులు నెలకొన్నాయి.

బాంఛన్ దొర నీ కాల్మొక్త ..అన్న సంస్కృతి తెలంగాణ అంతట విస్తరించింది. నిజాం సొంత అవసరాలకు 73 గ్రామాలను సర్ఫేఖాస్ గా ప్రకటించుకున్నాడు. పాయగా పేరుతో లక్షల ఎకరాలు నవాబు బంధు మిత్రులకు దాఖల పరిచాడు. 2,600 మంది జమీందారులు, జాగిర్దారులు దేశ్ ముఖ్‌లకు పదివేల గ్రామాల్లో వేల ఎకరాలు గ్రామాలకు గ్రామాలు దత్తత చేశాడు. వీరు గాక భూస్వాములు, పిల్ల జమిందారులు, ఇనాంధారులు, మక్తదారులు చేతుల్లో మిగతా భూమి ఆధీనంలో ఉండేది.

ఇక మిగిలిన భూములు సన్న చిన్నకారు రైతులకు ఉన్న అందులో పండిన ఎండిన పన్నులు తప్పకపోయేవి. గ్రామాల్లో ప్రజలకు ప్రజాస్వామ్యా హక్కులు లేవు.. ప్రశ్నించే శక్తి లేదు, చదువుకు అవకాశాలు లేవు. మాతృభాషకు స్థానం లేదు. పన్నులు, వడ్డీల పేరుతో ఉన్న భూములు లాక్కొని వెట్టిచాకిరి చేయించే వారు.

ఈ పరిస్థితుల్లో 1930లో ప్రారంభమైన ఆంధ్ర మహాసభ , 1938లో నిర్మితమైన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, గ్రంథాలయోధ్యమం, ఆర్య సమాజ్‌లు, 1939లో ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీలు హైదరాబాద్ సంస్థానంలో క్రమంగా తమ కార్యక్రలాపాలు విస్తరించుకోగా పీడిత ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలిస్తూ ముందుకు కదిలాయి. పరిటాల, మునగాల, బేతవోలు, కొలనుపాక, మునుగోడులలో రైతు పోరాటాలు రాజుకున్నాయి.

అసిఫాబాద్‌లో కొమురం భీమ్ పోరాటం సాగింది. 1941, 1944లలో భువనగిరి డివిజన్ బొల్లెపల్లి గ్రామానికి చెందిన కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా ఎన్నికైన కాలంలో.. ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి , మగ్దూం మోహినుద్దీన్, రాజా బహదూర్, దేవులపల్లి వెంకటేశ్వరరావుల నేతృత్వంలో దొరలు, దేశ్ ముఖ్ లకు, జాగిర్దారులకు వ్యతిరేకంగా గ్రామాల్లో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.

బాంఛన్ దొర కాల్మొక్తా అన్న పరిస్థితి నుండి బందూకులు పట్టి వెట్టి చాకిరి రద్దంటూ ఆంధ్ర మహాసభకు జై ..కమ్యూనిస్టు పార్టీకి జై అంటూ అరుణ పతాకాలతో “సంగం” గ్రామ రక్షణ దళాల సారధ్యంలో ఎగిసిన ఉద్యమాలు నిజాం నిరంకుశ పాలనను ఎదిరించాయి. అంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు పీడిత ప్రజల క్రాంతి రేఖగా, కదనరంగా సారధిగా మారాయి.

దీంతో నిజాం సేనలు, సయ్యద్ ఖాసిం రజ్వీ నేతృత్వంలోని మజ్లీస్ ఇత్తేహదుల్ జమై తేముస్లిం ఇన్ మత సంస్థకు చెందిన రజాకర్ మూకలు జగగీర్దారి.. దేశముఖ్‌ల ప్రైవేట్ సేనలు సంగం దళాల కార్యకలాపాలను అణిచివేసేందుకు గ్రామాలపై దాడులు జరిపి దౌర్జన్యాలు, అరాచకాలు,స్త్రీలపై సామూహిక అత్యాచారాలకు హత్యాకాండకు ఊచకోతలకు గృహదహనాలకు, లూటీలకు సజీవ దహనాలకు పాల్పడ్డారు.

ఈ పరిస్థితుల్లో 1941లో జనగామ తాలూకాలోని దేవరుప్పలలో దొరను ఎదిరించాడు అన్న కక్షతో బందగి అనే వ్యక్తిని హత్య చేయడంతో ప్రజల్లో దొరలపై తిరుగుబాటుకు బీజం వేసింది. తన అన్న అబ్బాస్ అలీతో నెలకొన్న ఆస్తి వివాదంలో బందగి భూమినంతా దొర దౌర్జన్యంగా అన్నకు కట్టబెట్టగా కోర్టులో తమ్ముడు బందగి గెలిచాడు. ఈ కేసులో దొర మాటను లెక్కచేయక పదేళ్లు న్యాయ పోరాటం చేసి గెలువగా అది అవమానంగా తలచిన దొర బందగిని చంపించాడు. 1943లో ఆకునూరులో నిజాం సేనలు విసునూర్ దేశ్ ముఖ్ అనుచరులు సామూహిక హత్యాకాండ జరిపి 12 మందిని హతమార్చారు.

సాయుధ పోరాట తొలి అమరుడు కొమురయ్య..!

1946లో జూన్4న కడవెండిలో విసునూర్ దేశ్ ముఖ్ దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ సంగం దళాల ఆధ్వర్యంలో సాగిన తిరుగుబాటు సంచలనంగా మారి తెలంగాణ అంతట దావనంలా వ్యాపించింది. 1946 జూన్4న విసునూర్ దేశ్ ముఖ్ గుండాలు కడవెండిలో బలవంతపు లేవి ధాన్యం సేకరణకు రాగా సంగం దళాల నేతృత్వంలో గ్రామస్తులు తిరుగుబాటు చేయగా గుండాల కాల్పుల్లో దొడ్డి కొమరయ్య వీర మరణం చెందాడు.

నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య బలిదానం గ్రామాల్లో మరింత అగ్రహ జ్వాలాలు రగిలించింది. ఈ ఘటన పిదప విసునూరు పరిధిలోని పాలకుర్తిలో చాకలి ఐలమ్మ అనే పేదరాలి ధాన్యాన్ని విసునూర్ దొర మనుషులు బలవంతంగా ఎత్తుకు పోతుండగా సంగం దళాల కార్యకర్తల సహకారంతో విజయవంతంగా ఎదుర్కొన్న స్ఫూర్తి తెలంగాణ అంతట విస్తరించి పీడిత ప్రజానీకాన్ని సాయుధ పోరాటం వైపు నడిపించింది.

1947లో సెప్టెంబర్ 13న ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌ల తరపున నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మోహినుద్దీన్‌లు భూమి కోసం భుక్తి కోసం నిజాం నిరంకుశ పాలన విముక్తి కోసం సాయుధ పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ ప్రజలకు పిలుపు నివ్వడంతో తెలంగాణ అగ్ని గుండం అయ్యింది. పీడిత తెలంగాణ ప్రజల కాంతిరేఖగా ఉన్న ఆంధ్ర మహాసభ ,కమ్యూనిస్టు పార్టీల సంగం గ్రామ రక్షణ దళాల్లో ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో చేరగా స్త్రీలు సైతం దళాల్లో చేరి పురుషులతో సమానంగా తుపాకులు పట్టారు.

ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి వారు మహిళా దళాలను సైతం నడిపించారు. ప్రజా పోరాటాలను అణిచి వేయడానికి నిజాం సేన , రజాకార్లు దొరలు దేశ్ ముఖ్‌లు, జాగీర్దార్ల ప్రవేటు సేనలు గ్రామాల్లో సాగించిన అరాచకాలు నాజీలను సైతం మించిపోగా నవాబు గోరిపైన విశాలాంధ్రలో ప్రజారాజ్య స్థాపన అంటూ తెలంగాణ సాయుధ పోరాట దళాల నేతృత్వంలో గ్రామాలు ఉద్యమించాయి. విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా 10వేల మంది గెరిల్లాలు సంగం గ్రామ రక్షణ దళాలుగా ఏర్పడి ప్రజల భాగస్వామ్యంతో పలుగు, పారా, కారం, రోకలి, గుత్పలు, వడిసెలు, బరిసెలు, బందూకులు ఆయుధాలుగా పోరాడారు.

దాడులు.. ప్రతి దాడులు

నిజాం సేనలు, రజాకార్ల అకృత్యాలకు తెలంగాణ పోరాటాలకు వేదికగా నిలిచిన నలగొండ పోరాటాల ఖిల్లాగా మారింది . నిజం సేనల.. రజాకార్ల దాడుల పర్వంలో 1946 అక్టోబర్ 18న సూర్యాపేట సమీపంలోని బాలెంలలో జరిగిన దాడిని వడిసెలు, కర్రలు, కారంపొడి, రాళ్లతో గ్రామస్తులు మూకుమ్మడిగా తిప్పికొట్టగా ఈ ఘటనలో 12 మంది గ్రామస్తులు చనిపోయారు. ప్రజల ప్రతిఘటనతో రెచ్చిపోయిన నిజాం సేనలు జనగామ తాలూకా మాచిరెడ్డిపల్లి, దేవరుప్పుల ,పాత సూర్యాపేట తాలూకా, బోనగిరి తాలూకా గ్రామాల్లో అత్యాచారాలు హత్యాకాండకు పూనుకున్నారు.

ఆకునూరులో 14 మందిని, కూటికల్లులో 31 మందిని, ధర్మపురం గోల్కొండలో 24 మందిని, అక్కిరాజు పల్లి లో 20 మందిని, వరంగల్ కొడకండ్లలో 30 మందిని, చౌటుప్పల్ 16 మందిని, దేవరుప్పల్‌లో 14 మందిని, కొంకిపాకలో 27 మందిని, సూర్యాపేట తాలూకా జాజిరెడ్డిగూడెంలో 66 మందిని, చందుపట్లలో 12 మందిని, సామూహికంగా హత్య చేశారు. 1948 జనవరి 10న రజాకార్లు బీబీనగర్ రైల్వే స్టేషన్‌ను దగ్ధం చేసి గ్రామంపై దాడి చేసి ఆరుగురిని హతమార్చారు. భువనగిరి తాలూకాలో రేణిగుంట, పులిగిల్లలో దేశ్ ముఖ్‌లు, జాగీర్దారుల, నిజాం సేనల దాడులను విజయవంతంగా తిప్పి కొట్టిన పోరాటాల్లో రేణిగుంటలో 26 మంది చంపబడ్డారు.

1948 మార్చి2 న రేణిగుంట రాంరెడ్డి నిజాం సైన్యం 400మందితో పోరాడిన తీరు వీరగాథగా నిలిచింది. పులిగిల్లలో సాగిన తిరుగుబాటులో 12 మంది, హతమయ్యారు. జనగామ తాలూకాలో బైరాన్ పల్లిలో 1948లో నిజాం మిలటరీ రజాకార్లు వందల సంఖ్యలో దాడి చేయగా సంగం దళాలు కత్తులు, కర్రలు వడిసెలు, కారంపొడిలతో ఎదుర్కొనగా శత్రువు తుపాకుల ముందు నిలవలేక చిక్కిన 88 మంది పోరాటయోధులను నిజాం సేనలు, రజాకార్లు వరుసలో నిలబెట్టి కాల్చి చంపారు.

1948లో గుండ్రంపల్లిపై నిజాం సేనలు ,రజాకార్లు దాడులు అత్యాచారాలు సాగించగా ఎదిరించిన 21 మందిని వరుసగా కాల్చి చంపి ,తర్వాత మరో 20 మంది వరకు చంపేశారు. మహిళలను వివస్త్రులుగా చేసి బతుకమ్మ లు ఆడించడం, అయినవారి ముందే అత్యాచారాలు చేసి, బలవంతపు మతమార్పిడి లకు పాల్పడ్డారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో వేల మంది బలిదానమవ్వగా , మరికొందరు జైలు పాలయ్యారు.

ఈ క్రమంలో నిజామాబాద్ జైలు నుంచే మహాకవి దాశరథి “ఓ నిజాం పిశాచమా ! కానరాడు నిను బోలిన రాజు మాకెన్నడేని..తీగెలను తెంపి అగ్గిలో దింపినావు.. నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ జైలు గోడలపై రాసి విప్లవ చైతన్యం రగిలించారు. వట్టికోట అళ్వార్ వంటి వారు గ్రంధాలయోధ్యమంతో ప్రజా చైతన్యానికి కృషి చేశారు.

కదం తొక్కిన సాయుధ పోరు.. గ్రామాల విముక్తి.. పోలీసు చర్య

తెలంగాణ విముక్తి పోరులో నిజాం సేనల, రజాకార్ల ఆకృత్యాలను ప్రతిఘటించే పోరాటాలు తెలంగాణ అంతట ఉదృతమైన క్రమంలో తెలంగాణ సాయుధ పోరాట దళాలు తిరుగుబాటు దాడుల్లో నిజాం మిలటరీ, రజాకార్ల క్యాంపులపై గెరిల్లా దాడులు చేస్తూ ఆయుధాలు వశం చేసుకుంటూ దాదాపు 4 వేల గ్రామాలను నిజాం సేనల నుంచి విముక్తి చేసి.. 10 లక్షల ఎకరాల వరకు భూములను పంపిణీ చేశారు.

ఒక్క ప్రక్క నిజాం సేనలతో రజాకార్లతో తెలంగాణ సాయుధ పోరాట దళాలు సాగిస్తున్న ప్రజా పోరాటాలతో.. మరో ప్రక్క హైదరాబాద్ కాంగ్రెస్ నేత రామానంద తీర్థ హైదరాబాత్‌ను భారత్‌లో విలీనం చేయాలన్న ఉద్యమంతో హైదరాబాద్ సంస్థానం తెలంగాణ ప్రాంతం అట్టుడికి పోయింది.

హైదరాబాద్ కాంగ్రెస్ 21వేల మందితో సత్యాగ్రహం నిర్వహించగా రామానంద తీర్ధ, కేవీ.రంగారెడ్డి, చెన్నారెడ్డి, అరుట్ల చంద్ర శేఖర్ రెడ్డి, దాశరధి కాలోజి నారాయణరావులు పాల్గొన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాంపై బాంబు వేసాడు అనే నేరంపై నిర్బంధితులయ్యాడు. ఈ సమయంలో రజాకార్ల అకృత్యాలను.. నిజాం పాలనను ప్రశ్నించినందుకు ఇమ్రోజ్ ఉర్దూ పత్రిక సంపాదకుడు షోయబుల్లా ఖాన్‌ను 1948 ఆగస్టు 21న రజాకార్లు హత్య చేశారు.

ఈ తరుణంలో ప్రజల ఆందోళనలను, రజాకార్ల జిహాద్ వైఖరిని, నిజాం అనుసరిస్తున్న భారత వ్యతిరేక పోకడలను, భారత్‌తో చేసుకున్న యధాతధ ఒప్పంద ఉల్లంఘనను, నిజాం ప్రధాని లాయక్ అలీ ఐక్య రాజ్యసమితిలో భారత వ్యతిరేక ఫిర్యాదును గ్రహించిన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.

భారత హోం మంత్రి సర్దార్ పటేల్ చొరవతో 1948లో సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో సైనిక చర్య (పోలీస్ యాక్షన్)ను ప్రారంభించి 17వ తేదీ నాటికి నిజాం పాలన నుంచి సంస్థానాన్ని విముక్తి చేసి ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసింది. ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ ముందు లొంగిపోయారు. నిజాం ప్రభుత్వం పతనమైంది. జనరల్ చౌదరి మిలటరీ గవర్నర్ గా నియమితులయ్యారు.

1949 డిసెంబర్1 న ఎంకే. వెల్లోడి ఆధ్వర్యంలో ఓ తాత్కాలిక మంత్రివర్గం ఏర్పాటు చేశారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్‌గా 1956 అక్టోబర్ 31 వరకు కొనసాగారు. నిజాం పాలనను ప్రజా వ్యతిరేక దిశగా నడిపించిన ప్రధాని లాయక్ అలీ, కాశిమ్ రజ్వీ పాకిస్థాన్ పారిపోయారు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అనంతరం కూడా కమ్యూనిస్టు పార్టీ సాయుధ దళాలు భారత సైన్యానికి వ్యతిరేకంగా 1950 అక్టోబర్21న తెలంగాణ సాయుధ పోరాట విరమణ ప్రకటన వరకు పోరాడాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ విముక్తి దినం కాస్తా.. విలీన దినం, విద్రోహ దినం అంటూ విభిన్న వాదనలకు దారి తీసింది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కోసం నిజాం సేనలతో, రజాకార్లతో, భారత సైన్యాలతో 4000 మంది బలిదానంతో సాగించిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లోకి ఎక్కి అణిచివేత నుంచే విప్లవం పుడుతుందనడానికి నిదర్శనంగా నిలవడంతో పాటు తెలుగు ప్రజల చైతన్యాన్ని ప్రతీకగా నిలిచింది.

రాలిన పొరట యోధులు

నిజాం నిరంకుశ పాలన నుంచి రజాకార్ల అకృత్యాల నుండి తెలంగాణను విముక్తి చేసేందుకు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల సాయిధ గెరిల్లా దళాలు సాహసోపేతంగా చేసిన పోరాటాల క్రమంలో జరిగిన దాడులు ప్రతిదాడుల్లో గెరిల్లా దళాల నాయకులు ఎందరో వీరమరణం చెందారు.

వారిలో అనబెరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి, దామోదర్ రెడ్డి, సూర్యాపేట బోనగిరి, రామన్నపేట, జనగామ తాలూకాకు చెందిన పసునూరి వెంకటరెడ్డి, బాలెంలా అనంత రెడ్డి, మట్టా రెడ్డి, రేణిగుంట రాంరెడ్డి, జగదేవ్పూర్ పాశం రాంరెడ్డి. ఇంకా లక్ష్మీదేవి గూడెం కందాల బాల్ రెడ్డి, పొనుగాటి సీతారామారావు, కుర్రారం రాం రెడ్డి, ఎల్కపల్లి కవి యాదగిరి, కొంతం కొండల్ రెడ్డి , బొల్లెపల్లి బద్దం నారాయణ, మల్లారెడ్డి, నరసింహులు గుండ్రంపల్లి కోదండరామిరెడ్డి సుంకిశాల ఫైళ్ల రామచంద్రారెడ్డి, పద్మారెడ్డి, కొంగరి అచ్చయ్య, ఆలేరు ఐలయ్య, పులిగిల్ల కొమురయ్య, కొమ్మిడి బుచ్చిరెడ్డి, బొబ్బల నర్సిరెడ్డి, బండారు నర్సిరెడ్డి ,పర్ణ జానకి రెడ్డి, మందడి సోమిరెడ్డి, గోలి పింగళి రెడ్డితో పాటు 4వేల మంది అమరులయ్యారు.

Exit mobile version