Elon Musk | భారత ప్రధాని నరేంద్ర మోదీకి తాను పెద్ద అభిమానిని అని టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. వీలైనంత త్వరగా భారత్‌లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. అమెరికాలో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో ఎలన్ మస్క్ బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. మోదీతో భేటీ అద్భుతంగా జరిగిందన్నార్ మస్క్.
ఇక వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని మస్క్ ప్రకటించారు. భారత్‌లో టెస్లా కార్యకలాపాలకు మోదీ నుంచి సహకారం లభిస్తోందని తెలిపారు. అయితే దీనిపై త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న మస్క్.. భారత్‌తో సంబంధాల విషయంలో తమ నిర్ణయం కీలకంగా మారనుందని పేర్కొన్నారు. భారత్ భవిష్యత్‌పై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని మస్క్ తెలిపారు. భారత్‌పై మోదీకి చాలా శ్రద్ధ ఉందని ప్రశంసించారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలని మోదీ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. భారత్‌లో సౌర ఇంధనంలో పెట్టుబడులకు గొప్ప అవకాశాలు ఉన్నాయని మస్క్ పేర్కొన్నారు.
స్థానిక ప్రభుత్వాల నియమ, నిబంధల్ని పాటించడం తప్ప మరో మార్గం లేదని ట్విట్టర్ విషయంలో మస్క్ స్పందించారు. లేదంటే కార్యాలయాలు మూసివేయాల్సి వస్తుందన్నారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనల సమయంలో ట్విట్టర్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందంటూ ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సె ఇటీవలే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయా దేశాల చట్టాలను పాటించాల్సిందేనని మస్క్ ఉద్ఘాటించారు.