Telangana | CPI, BRS మధ్య పొత్తు పొడవనట్టేనా?

చాడ పోటీ ఖాయమన్న నారాయణ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఘాటు వ్యాఖ్యల వెనుక మతలబేంటి? విధాత బ్యూరో, కరీంనగర్: కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు కమ్యూనిస్టు పార్టీలను ఆలోచనలో పడేశాయా? తెలంగాణ (Telangana) అధికార పార్టీతో కలిసి ముందుకు సాగితే నట్టేట మునగడం ఖాయమనే అభిప్రాయం కల్పించాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఇటీవల నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్‌లో నిర్వహించారు. […]

  • Publish Date - May 17, 2023 / 09:51 AM IST

  • చాడ పోటీ ఖాయమన్న నారాయణ
  • ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు
  • ఘాటు వ్యాఖ్యల వెనుక మతలబేంటి?

విధాత బ్యూరో, కరీంనగర్: కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు కమ్యూనిస్టు పార్టీలను ఆలోచనలో పడేశాయా? తెలంగాణ (Telangana) అధికార పార్టీతో కలిసి ముందుకు సాగితే నట్టేట మునగడం ఖాయమనే అభిప్రాయం కల్పించాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఇటీవల నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజటి పెళ్ళికొడుకు చాడ వెంకటరెడ్డి.. సర్పంచ్‌గా, మండల పరిషత్ అధ్యక్షునిగా, జడ్పీటీసీగా, శాసనసభ్యునిగా ఆయన కింది స్థాయి నుంచి పైకి ఎదిగి వచ్చారు. తన సొంత నియోజకవర్గంలో పోటీ చేసే హక్కు ఆయనకు లేదా? ఖచ్చితంగా ఆయన ఇక్కడి నుండే పోటీ చేసి తీరుతారు’ అంటూ హుస్నాబాద్ సీటుపై తమ పార్టీ వైఖరిని తేటతెల్లం చేశారు.

ఒడితలకే ఖాయమంటూ కేటీఆర్‌ సంకేతాలు

కొద్దిరోజుల క్రితం ఇదే నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు స్థానిక శాసనసభ్యుడు ఒడితల సతీష్ బాబుకు మళ్లీ టికెట్ ఖాయమనే సందేశం ఇచ్చారు.

ఆయనను లక్ష ఓట్లమెజార్టీతో గెలిపించాలని స్వయంగా పిలుపునిచ్చారు. అటు మంత్రి కేటీఆర్‌, ఇటు సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యలు చూస్తే రెండు పార్టీల మధ్య పొత్తులకు తలుపులు మూసుకుపోయినట్టే అన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

మునుగోడుతో కలిసిన బంధం నిలిచేనా?

మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు అధికార బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చాయి. ఆ తర్వాత ఆ బంధం మరింత దృఢపడిందని నేతలు చెబుతూ వస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో తాము పొత్తు పెట్టుకుంటామని సీపీఎం బహిరంగంగానే సంకేతాలు ఇచ్చింది.
సీన్‌ మార్చేసిన కర్ణాటక ఎన్నికలు

ఇక మూడు పార్టీల మధ్య సీట్లు ఖరారు కావడమే మిగిలింది అనుకుంటున్న తరుణంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సీన్‌ను మార్చేశాయని సీపీఐ నేత మాటలను చూస్తే అర్థం అవుతున్నది. హుస్నాబాద్ బహిరంగసభలో నారాయణ అధికార పార్టీపై విమర్శలు చేయడం, ఆ పార్టీ పనితీరుపై కటువైన వ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనం.

సీఎంగా కేసీఆర్‌ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదని ఆరోపించిన నారాయణ.. కోట్లు వెచ్చించి కట్టిన సచివాలయంలోకి ప్రజలను రానీయకపోవడంపై నిప్పులు చెరిగారు. అందులోకి ఎవరినీ వెళ్ళనీయకపోవడం అంటే అదో స్మశానం కిందే లెక్కేనటూ ఎత్తి పొడిచారు.

ప్రజలకు ప్రవేశం లేకపోతే భూమాఫియా దారులు, ఇసుక మాఫియా, రేపిస్టులకు అది ఆలవాలంగా మారుతుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంటే ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేయగలిగేవారు కాదని పరిశీలకులు అంటున్నారు.

హుస్నాబాద్‌పై ‘చాడ’ ఆశలు

పీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. 2004లో ఇక్కడి నుండి గెలుపొంది, శాసనసభలో సీపీఐ పక్ష నాయకునిగా వ్యవహరించిన ఆయన 2009, 2018 ఎన్నికల్లో వరుస ఓటములు చవి చూశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసినా విజయం ఆయనను వరించలేదు.

ఈసారి అధికార పార్టీతో జత కలిసి హుస్నాబాద్‌లో గెలవాలనుకున్న చాడ ఆశలపై మంత్రి కేటీఆర్‌ నీళ్లు చల్లారు. దీంతో ప్రజాచైతన్య యాత్ర ముగింపు కార్యక్రమాన్ని తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నారని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి నారాయణ నోటితోనే టికెట్‌ తనకేనని చెప్పించుకోగలిగారని అంటున్నారు

Latest News