Site icon vidhaatha

‘ది ఘోస్ట్’ రివ్యూ: మ్యాటర్ తక్కువ.. మోత ఎక్కువ! యాక్షన్‌ ఓన్లీ

మూవీ పేరు: ‘ది ఘోస్ట్’
విడుదల తేదీ: 05, అక్టోబర్ 2022
నటీనటులు: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్
సంగీతం: భరత్-సౌరభ్, మార్క్. కె. రాబిన్
సినిమాటోగ్రఫీ: ముకేష్
ఎడిటింగ్: ధర్మేంద్ర
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
రచన, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

విధాత: కింగ్ నాగార్జున నుంచి ఈ సంవత్సరం సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమా వచ్చి మంచి హిట్టే అయింది. ఆ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున చేసిన చిత్రం ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని కూడా కంప్లీట్ చేశాడు. ఆ సినిమా రీసెంట్‌గానే విడుదలై.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా విడుదల తర్వాత.. ‘ది ఘోస్ట్’ని దసరా బరిలో దించేందుకు రెడీ చేస్తూ వచ్చారు.

క్రియేటివ్ దర్శకుడిగా వైవిధ్యమైన చిత్రాలతో.. ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ.. ముందుకెళుతున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన‌తో నాగార్జున సినిమా అని ప్రకటించినప్పుడే ఈ సినిమా వార్తలలో నిలిచింది. మధ్యలో వచ్చిన టీజర్, స్టిల్స్, రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ సినిమాలో ఏదో కొత్తదనం ఉందనిపించేలా చేశాయి. ఒకవైపు చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సినిమాతో బరిలోకి దిగుతున్నా.. ధైర్యంగా నాగార్జున వస్తున్నాడంటే.. సినిమాలో ఏదో మ్యాటర్ ఉన్నట్లే అనిపించింది.

అందులోనూ నాగార్జున కెరీర్‌కి బీభత్సమైన బ్రేక్ ఇచ్చిన ‘శివ’ సినిమా విడుదల తేదీ కావడంతో.. అస్సలు నాగ్ అండ్ టీమ్ వెనక్కి తగ్గలేదు. నాగార్జున కూడా ఈ విషయాన్ని ఇంటర్వ్యూలలో పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక గత వారం, పది రోజులుగా ఈ సినిమాకు జరుగుతోన్న ప్రమోషన్ అయితే.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మరి అంచనాలను, ‘శివ’ సెంటిమెంట్‌ను ఈ సినిమా అందుకుందో లేదో.. రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ఇంటర్‌పోల్ అధికారులైన విక్రమ్ (నాగార్జున).. ప్రియ (సోనాల్ చౌహాన్)‌ కలిసి దుబాయ్‌లో వర్క్ చేస్తుంటాడు. ఇద్దరూ డీప్ ప్రేమలో మునిగిపోయి సహజీవనం చేస్తుంటారు. ఈ టైమ్‌లో జరిగిన ఓ ఆపరేషన్‌లో రౌడీ మూక ఓ పిల్లాడిని చంపేస్తారు. ఆ ఘటనని విక్రమ్ తట్టుకోలేడు. అది అతనిని వేధిస్తూ ఉంటుంది. (ఈ పాయింట్ ఇటీవల వచ్చిన విజయ్ ‘బీస్ట్’ సినిమాని తలపిస్తుంది).

ఇదే టైమ్‌లో తన సోదరి అను (గుల్‌పనాగ్).. విక్రమ్‌కి కాల్ చేసి .. తను, తన కూతురు అదితి (అనైకా సురేంద్రన్) కష్టాల్లో ఉన్నామని, వెంటనే వచ్చి రక్షించమంటుంది. సోదరి కాల్‌తో విక్రమ్ ఊటీ వెళతాడు. ఊటీ వెళ్లిన అతనికి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. తన సోదరిని, ఆమె కూతురుని విక్రమ్ ఎలా కాపాడాడు? అసలు వాళ్లకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమిటి? వాటిని విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు? ప్రియ ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే.. యాక్షన్ ప్యాక్‌డ్‌గా తెరకెక్కిన ఈ సినిమాని చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమా అంతా వన్ మ్యాన్ షోగా నడిచింది. విక్రమ్‌గా నాగార్జున ఇరగదీశాడు. ఈ సినిమాలో చాలా వైవిధ్యం గానూ, స్టైలిష్‌ గానూ కనిపించడమే కాకుండా.. అదే స్థాయిలో నటనను కూడా కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌.. ఈ మధ్య కాలంలో నాగార్జున ఇటువంటి యాక్షన్ సినిమాలైతే చేయలేదు. నాగార్జున డైలాగ్స్ పలికిన తీరు, తమహాగానే అనే కత్తితో ఆయన చేసిన యుద్ధం సినిమాకే హైలెట్. అందుకే అంది సినిమా అంతా వన్ మ్యాన్ షో‌గా నడిచిందని.

అతని ప్రియురాలిగా సోనాల్ కూడా చక్కగా నటించింది. అందాలతోనూ, అలాగే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ ఆమె మెప్పించింది. వాస్తవానికి ఈ పాత్రకి ఫస్ట్ కాజల్ అనుకున్నారు. ఆమెతో కొంత మేర షూటింగ్ కూడా చేశారు. కానీ కాజల్ కంటే కూడా సోనాల్ ఈ పాత్రకి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. నాగార్జున సోదరిగా బాలీవుడ్ భామ గుల్ పనాగ్‌‌కి కూడా మంచి పాత్రే పడింది.

ఆమె కుమార్తెగా చేసిన అనైకా పాత్రే ఈ సినిమాకి కీలకం. ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా దర్శకుడు ప్లాన్ చేశాడు. ఆ పాత్రలో అనైకా కూడా తన నటనతో మెప్పించింది. ఇంకా విలన్‌గా చేసిన మనీశ్ చౌదరి, ఇతర పాత్రలలో చేసిన శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాశ్ వంటి వారు.. వారి పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక విభాగానికి వస్తే.. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. నిర్మాణం విషయంలో నిర్మాతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదని తెలిసిపోతుంది. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ ముఖేష్ పనితనానికి, నేపథ్య సంగీతం అందించిన మార్క్ కె. రాబిన్‌కు మంచి మార్కులు పడతాయి. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్, ధర్మేంద్ర ఎడిటింగ్ కూడా ఓకే. మిగతా సాంకేతిక నిపుణులు కూడా వారి పనితనం చూపించారు. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ఇక ప్రవీణ్ సత్తారు విషయానికి వస్తే.. నాగార్జునతో ఓ హాలీవుడ్ ఫిల్మ్ చేసినట్లుంది. నాగార్జునని ఆయన చూపించిన తీరుకి అక్కినేని ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతారు.. అంత బాగా చూపించాడు.

విశ్లేషణ:
ప్రవీణ్ సత్తారు తన దర్శకత్వ ప్రతిభను చాటాడు కానీ.. అదంతా నాగార్జున పైనే ఫోకస్ పెట్టినట్లు అనిపించింది. కథ, కథనంపై కూడా కాస్త దృష్టి పెట్టి ఉంటే మాత్రం.. ఈ సినిమా రీమేక్ కోసం బాలీవుడ్ వాళ్లు కూడా ఎగబడే వారు. ఫ్యామిలీ డ్రామాని నడపడంలో దర్శకుడు సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో సినిమా యూనివర్శల్ అప్పీల్ మిస్సయింది. యాక్షన్ పార్ట్‌తో మెప్పించిన దర్శకుడు.. చూస్తున్న ప్రేక్షకులని కథలోకి తీసుకెళ్ల లేకపోయాడు. మంచి డ్రామాకి ఈ సినిమాలో అవకాశం ఉంది.. కానీ దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. దీంతో ఇది యాక్షన్ లవర్స్‌కి తప్ప.. ఇతరులకి నచ్చే ఛాన్స్ తక్కువ.

విక్రమ్‌కి ఉన్న రిలేషన్స్‌తో భావోద్వేగాలు రాబట్టే అవకాశం ఉండి కూడా.. ఆ ఛాన్స్ దర్శకుడు యూజ్ చేసుకోలేదు. అసలు కథని అలా అలా నడిపేసి.. యాక్షన్ పార్ట్‌ని మాత్రం హాలీవుడ్ రేంజ్‌లో స్టైలిష్‌గా తెరకెక్కించాడు. కానీ ఏం లాభం.. పండగకి వచ్చిన సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చితేనే కదా.. నాలుగు టికెట్లు తెగేది. ప్రథమార్థం అంతా.. రొమాంటిక్‌గా నడిపి.. మధ్యలో ఇంటర్‌పోల్ కాబట్టి.. రెండు ఆపరేషన్స్‌ చేయించి.. లాగించేశాడు. సెకండాఫ్‌లో పర్లేదు అనుకునే లోపు మళ్లీ గ్రాఫ్ పడిపోయే సీన్లు ఎంటర్‌ అవుతాయి. విషయం సైడ్ ట్రాక్‌లో పెట్టి.. లాజిక్ లేని యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఎంతసేపని ప్రేక్షకులు చూస్తారు.

సినిమాలో విలన్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. ‘కేజీయఫ్, విక్రమ్’ సినిమా తరహాలో మెషిన్ గన్ల మోత కూడా ఇందులో ఎక్కువే ఉంది. రియలిస్టిక్ కథని ఎంచుకున్న దర్శకుడు.. అంతే రియలిస్టిక్‌గా సినిమాని తెరకెక్కించడంలో తడబడ్డాడని చెప్పుకోవచ్చు. యాక్షన్ ప్రియులను మాత్రం ఈ చిత్రం మెప్పిస్తుంది. ముఖ్యంగా చర్చి ఫైట్, ఆ ఫైట్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు కిక్కిస్తాయి. మొత్తంగా చూస్తే.. ‘శివ’ సెంటిమెంట్‌ని ఈ సినిమా అందుకోలేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే పండగ సీజన్, కాస్త పేరున్న హీరో, బలంగా ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్‌తో సినిమా గట్టెక్కే అవకాశాలే ఉన్నాయి.

ట్యాగ్‌లైన్: మ్యాటర్ తక్కువ.. మోత ఎక్కువ!
రేటింగ్: 2.75/5

Exit mobile version