నిషేధించినా.. ‘మోదీ’ బొమ్మ పడింది!

అంతర్జాతీయ పత్రికల్లో భారత విద్యార్థుల సత్తా పలు ప్రాంతాల్లో మోదీపై BBC డాక్యుమెంటరీ ప్రదర్శన India:The Modi Question విధాత: ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వాటి లింకులను తొలగించాలని ఆదేశించింది. కానీ.. ఈ అంతర్జాల ప్రపంచంలో దాని లింకులు సజీవంగానే ఉన్నాయి. వాటిని దేశంలోని కీలక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రదర్శించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. దీనికి కొన్ని యూనివర్సిటీల్లో అనుమతులు […]

  • Publish Date - January 27, 2023 / 11:01 AM IST

  • అంతర్జాతీయ పత్రికల్లో భారత విద్యార్థుల సత్తా
  • పలు ప్రాంతాల్లో మోదీపై BBC డాక్యుమెంటరీ ప్రదర్శన

India:The Modi Question

విధాత: ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వాటి లింకులను తొలగించాలని ఆదేశించింది. కానీ.. ఈ అంతర్జాల ప్రపంచంలో దాని లింకులు సజీవంగానే ఉన్నాయి. వాటిని దేశంలోని కీలక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రదర్శించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. దీనికి కొన్ని యూనివర్సిటీల్లో అనుమతులు ఇవ్వలేదు.. మరికొన్ని చోట్ల అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి కరంట్ బంద్ చేశారు. ఇంకొన్ని చోట్ల డాక్యుమెంటరీని ప్రదర్శించినవారిపై దాడులు జరిగాయి.. అయినా.. భారతదేశంలోని ప్రగతిశీల, ప్రజాతంత్ర విద్యార్థి శక్తులు తమ సత్తా చాటాయి.

దేశంలో మోదీ డాక్యుమెంటరీ ప్రదర్శన విషయంలో చెలరేగిన వివాదం, ప్రత్యేకించి యూనివర్సిటీల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. అడ్డంకులను అధిగమించి ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్ (India: The Modi Question)’ డాక్యుమెంటరీని ప్రదర్శించిన తీరు తెన్నులు అంతర్జాతీయ పత్రికల్లో పతాక, ప్రధాన శీర్షికలయ్యాయి. 2002 గుజరాత్ అల్లర్లు, వాటిలో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోదీ పాత్ర.. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని చెలరేగిన హింస తదితర అంశాలతో బీబీసీ వార్తా సంస్థ India: The Modi Question పేరిట మొదటి ఎపిసోడ్ ను ప్రసారం చేసింది. అప్పటి సీఎం నరేంద్ర మోదీ నేరుగా బాధ్యుడని పేర్కొంటూ బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన (ఇప్పటి వరకు బయటకు రాని) ఒక నివేదికను సైతం బీబీసీ తన కథనంలో ప్రస్తావించింది.

ఈ కథనం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. అయితే.. అది రాజకీయంగా బీజేపీకి నష్టం చేకూర్చేలా ఉండటంతో ఆగమేఘాలపై దానిని కేంద్రం నిషేధించింది. అప్పటికే వీటిని అనేక మంది డౌన్ లోడ్ చేశారు. మరికొందరు ఇతర మాధ్యమాల నుంచి వాటి లింకులు సంపాదించారు. మోదీ ప్రభుత్వ మత తత్వ విధానాలను తీవ్రంగా నిరసించే పలు విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా బీబీసీ డాక్యుమెంటరీని యూనివర్సిటీల్లో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి. అయితే.. సదరు విశ్వ విద్యాలయాలు అందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ.. అడ్డంకులను అధిగమించి విద్యార్థులు పలు చోట్ల విజయవంతంగా డాక్యుమెంటరీలను ప్రదర్శించిన తీరును పలు ప్రపంచ స్థాయి పత్రికలు ఎలుగెత్తి చాటాయి.

అడుగడుగునా అడ్డంకులు

ఢిల్లీలోని ప్రఖ్యాత జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. అధికారులు కరెంటుతో పాటు.. ఇంటర్నెట్‌ను కూడా బంద్ పెట్టారు. అదే సమయంలో వర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శన తిలకించేందుకు వచ్చిన వారిపై ప్రత్యర్థి విద్యార్థి సంఘాల వారు రాళ్లతో దాడులు చేశారని వార్తలు వచ్చాయి. అడ్డంకులు అధిగమించిన విద్యార్థులు మొత్తానికి డాక్యుమెంటరీని తమ లాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లలో తిలకించారు. జామియా మిలియాలో డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళ, హైదరాబాద్ వర్సిటీలలోనూ ఉద్రిక్త పరిస్థితుల మధ్య విద్యార్థులు డాక్యుమెంటరీని తిలకించారు.

ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, ఉద్రిక్త పరిస్థితులపై బీబీసీతో పాటు.. న్యూ యార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఎన్.పి.ఆర్., సి.బి.ఎస్. న్యూస్, అల్ జజీరా, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, ఫార్చూ్న్, ఇండిపెండెంట్, స్లేట్, ఫారిన్ పాలసీ వంటి పత్రకలు, మీడియా సంస్థలు కవర్ చేశాయి. విద్యార్థుల చొరవను ప్రశంసించాయి. విదేశీ మీడియా కుట్రగా కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తున్న డాక్యుమెంటరీని స్మార్ట్ ఫోన్ల వెలుగులో వీక్షించారని పేర్కొన్నాయి. ఒక మీడియా సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడం ద్వారా.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం నిరంకుశత్వ పాలన వైపు దిగజారి పోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

Latest News