విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఓడలు బండ్లు అవుతాయనే నానుడి పాలమూరు గులాబీ నేతలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఇంతకాలం అధికార దాహంతో పొంగిపోయిన నేతల కుర్చీలు కదిలించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల నుంచే కాకుండా ఇతర పదవుల నుంచి కూడా బీఆర్ఎస్ నేతలను దించడానికి కాంగ్రెస్ నేతలు కసరత్తులు ప్రారంభించారు.
ఇంతకాలం పదవులను పట్టుకొని వేలాడుతున్న నేతలకు ఎప్పుడు పదవి ఊడుతుందో అని ఆవేదనలో ఉన్నారు. పదవి పోవడం పక్కా అని.. అది ఎప్పుడు పోతుందనే విషయం తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే పాలమూరు మున్సిపల్ చైర్మన్ పదవిపై కాంగ్రెస్ నేతలు గురిపెట్టారు. ఈ కుర్చీపై ఉన్న బీఆర్ఎస్ నేతను దించి, కాంగ్రెస్ నేతను కూర్చోబెడితే పాలమూరు పట్టణంలో కాంగ్రెసుకు పట్టుదొరుకుందనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకే..
పాలమూరు మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడి మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన నర్సింహులు పదవిలో ఉన్నారు. ఇంతకాలం ఇక్కడ బీఆర్ఎస్ కు చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉండడంతో చైర్మన్ కు అండగా ఉండేవారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ఓటమి చెందడం.. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందడంతో పాలమూరు రాజకీయాలు మలుపు తిరిగాయి.
ఇక్కడ పట్టు నిలవాలంటే మున్సిపాలిటీ తమ చేతుల్లో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే పథక రచన చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధిక శాతం కాంగ్రెస్ వైపు రావడంతో అవిశ్వాసానికి సిద్ధపడుతున్నారు. ఈ మున్సిపాలిటీలో 49 వార్డుల్లో అధిక శాతం బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలుపొందగా, రెండో వార్డు కౌన్సిలర్ నర్సింహులు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయనను పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నారు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. మెజారిటీ కౌన్సిలర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం అవిశ్వాసం పెట్టి బీఆర్ఎస్ చైర్మన్ ను గద్దె దించే అవకాశం ఉంది. ఆయన స్థానంలో 21వవార్డు కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ ను చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది.
బీఆర్ఎస్ కు చెందిన ఆనంద్ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు కొందరు బీ ఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతుగా వచ్చే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మరి కొద్దిరోజుల్లో అవిశ్వాసం పెట్టి బీఆర్ఎస్ చైర్మన్ ను పదవి నుంచి తప్పించి, ఆనంద్ గౌడ్ ను చైర్మన్ పదవిలో కూర్చోబెట్టెందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
ముడా చైర్మన్ కు పదవీ గండం?
మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్ అథారిటీ (ముడా)చైర్మన్ పదవిపై కాంగ్రెస్ కన్ను పడింది. ప్రస్తుతం ముడా చైర్మన్ గా బీఆర్ఎస్ నేత గంజి వెంకన్న పదవిలో ఉన్నారు. వెంకన్నను అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముడా చైర్మన్ గా నియమించారు. పెద్దగా ఎవరికీ తెలియని నాయకున్ని ఈ కుర్చీలో కూర్చోబెట్టడంతో అప్పట్లో శ్రీనివాస్ గౌడ్ పై సొంత పార్టీకి చెందిన కొందరు విమర్శలు చేశారు. ఆయనకు అడ్డు చెప్పలేక, ఈ పదవి ఆశించిన నేతలు మౌనంగా ఉండిపోయారు.
శ్రీనివాస్ గౌడ్ తన చెప్పుచేతల్లో ఉండే నాయకులకే పదవులు కట్టాబెడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆయనను ఎదురించలేక కొందరు నాయకులు పార్టీలో అణిగిమణిగి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఓటమి చెందడంతో ముడా చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ప్రస్తుత చైర్మన్ గంజి వెంకన్నను తొలగించి ఆ పీఠంపై కాంగ్రెస్ నేత అమర్ ను కూర్చోబెట్టాలని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అమర్ కూడా బీ ఆర్ఎస్ లో ఉండి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు. కొద్ది రోజుల్లో ముడా చైర్మన్ ను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా కాంగ్రెస్ నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు చెందిన రాజేశ్వర్ గౌడ్ ఈ పదవిలో ఉన్నారు. ఆయనకు ఉద్వాసన పలికేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.
ఇవన్నీ జరిగితే పాలమూరులో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా మారుతుందని ఆపార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ ను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ముందుగా ఆపార్టీ నేతలు కూర్చున్న కుర్చీలకు ఎసరు పెట్టాలని వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. త్వరలో పాలమూరులో ‘ఎన్నం’ మార్క్ రాజకీయం కనపడబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.