Site icon vidhaatha

గురుకులాల్లో భారీగా పెరగనున్న పోస్టులు

విధాత: రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సి పోస్టుల సంఖ్య భారీగా పెరగనున్నది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మరో 2 వేలకు పైగా పోస్టులను ఆయా సొసైటీలు గుర్తించాయి. త్వరలో భర్తీ చేయనున్న గురుకుల నియామక ప్రకటనల్లో భాగంగా వీటిని కూడా నింపేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.

అందుబాటులో ఉన్న 11,012 పోస్టులకు నియామక ప్రకటనలు సిద్ధమయ్యాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో అవి నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్‌ ముగిసే సమయానికి ఎస్సీ, ఎస్టీ గురుకుల పోస్టులకు అనుమతు వస్తే వాటితో కలిపి ప్రకటనలు ఇవ్వాలని భావిస్తున్నది.

సంక్షేమ గురుకులాల్లో ప్రభుత్వం తొలుత 9,096 పోస్టులు మంజూరు చేసిన విషయం విదితమే. ప్రస్తుత విద్యా సంవత్సరానికి బీసీ సొసైటీ పరిధిలో కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కాలేజీలు ప్రారంభమయ్యాయి.

ఈ పోస్టులకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ఈ జనవరిలో బీసీ గురుకుల సొసైటీలో 2,591 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గురుకులాల ఉద్యోగ ప్రకటనలో బ్యాక్‌లాగ్‌ నివారించడానికి మొదట ఉన్నత పోస్టులకు, తర్వాత కింది పోస్టులకు ప్రకటనలు జారీ చేసి ఆ మేరకు భర్తీ ప్రక్రియను నియామక బోర్డు చేపట్టనున్నది.

Exit mobile version