విధాత: ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. గత ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వం విభేదించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని పర్యటనల సందర్భంగా తన అసంతృప్తిని వెల్లడిస్తున్నది. అయితే రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటే ప్రభుత్వ వైఖరిని ఎవరూ తప్పుపట్టేవాళ్లు కాదు.
కానీ అధికారిక కార్యక్రమాలకు కూడా కేసీఆర్ దూరంగా ఉండటం పెద్ద దుమారాన్ని రేపుతున్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, మా విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవడం లేదు, తెలంగాణకు న్యాయం చేయడం లేదని నిత్యం విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు అధికారిక కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో నిర్దిష్ట కారణాలు చెప్పడం లేదు.
పక్క రాష్ట్ర సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జి లాంటి వాళ్లు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూనే ప్రధాని, కేంద్ర మంత్రుల వంటి వాళ్లు ఆయా రాష్ట్రాల్లో పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రోటోకాల్ పాటిస్తున్నారని, దీన్ని తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉల్లంఘిస్తున్నదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
నిన్న బీజేపీ ముఖ్యనేతలతో ప్రధాని సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టాలని, ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అయినా ఈరోజు జరిగిన పలు కార్యక్రమాలకు ఏపీ సీఎం హాజరయ్యారు. ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు. విభజన గాయాల నుంచి ఏపీ పూర్తి కోలుకోలేదని, కేంద్రం సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్ నిర్మాణానికి ఉపయోగ పడుతుందని జగన్ అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా ప్రధాని పర్యటనల్లో అధికారికంగా పాల్గొని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని బీజేపీ నేతలు సూచిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటున్నారు.
అంతేగాని అధికారిక పర్యటనలకు దూరంగా ఉంటూ కేంద్రం ఏమీ చేయడంలేదని, తెలంగాణపై వివక్ష చూపిస్తున్నదని విమర్శలు చేసినంత మాత్రానా సమస్యలు తీరుతాయా? అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సీఎం కేసీఆర్ తన నిరసనను తెలియజేయవచ్చు, అధికారిక కార్యక్రమంలో పాల్గొంటూ తమిళనాడు సీఎం వలె సమస్యలను ఏకరువు పెట్టవచ్చు అని అభిప్రాయపడుతున్నారు.