విధాత: సీఎం కేసీఆర్ కుటుంబం 18 లక్షల ఎకరాలను ఆక్రమించుకోవడానికే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నీ కేసీఆర్ కుటుంబం చేతిలోకి వెళ్లిపోయాయన్నారు.
ధరణి పోర్టల్ దేశంలోనే పెద్ద స్కాం అని ధరణి’ వచ్చాక 24 లక్షల ఎకరాల భూములను హోల్డ్ చేశారన్నారు. 6లక్షల ఎకరాలను హోల్డ్ చేసి, డబ్బులు తీసుకున్నాక రిలీజ్ చేశారన్నారు. 18 లక్షల కోట్ల విలువైన భూములు కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నాయి’’ అని ఆయన ఆరోపించారు. ‘‘ వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు. డబ్బులిస్తేనే నిషేధిత జాబితా నుంచి తీసేస్తున్నరు’’ అని మండిపడ్డారు.
కాగా.. నిషేధిత జాబితాలోని భూములపై రాష్ట్ర సర్కారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘ధరణి పోర్టల్‌ను ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోందని, వాళ్ల చెప్పు చేతల్లో ధరణి పోర్టల్ నడుస్తోందని, భూములన్నీ వాళ్ల కంట్రోల్ లోనే ఉన్నాయన్నారు. ఇది రూ.18 లక్షల కోట్ల విలువైన స్కామ్ అని.. సామాన్యులకు, తెలంగాణ ప్రజలకు తెలవకుండా ఈ స్కాం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ఉన్న భూములపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఈవిషయాన్ని ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. ‘‘కేసీఆర్ 2013లో తనకు 60 ఎకరాలు ఉన్నట్లు చెప్పారు.. కానీ ప్రస్తుతం ఫామ్ హౌస్ సహా దాదాపు 600 ఎకరాలు కేసీఆర్ బినామీల పేరిట ఉన్నాయని ఆ 600ఎకరాలు ధరణి పోర్టల్‌లో లేవని అన్నారు.
కేటీఆర్‌కు జన్వాడలో ఫామ్ హౌస్ ఎక్కడిది ? వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినయ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థలు బయటికి తీసుకొస్తయని.. వాళ్లు జైలుకు పోక తప్పదన్నారు. టీఆర్ఎస్‌కు చెందిన 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వచ్చి మునుగోడులో ధన ప్రవాహం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
కాషాయ కండువా కప్పుకున్న వాళ్లను బెదిరిస్తున్నరని.. ఇది ధర్మ యుద్ధం.. మునుగోడు ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య ఈ యుద్ధం జరుగుతోందని ఆన్నారు. 2009 నుంచి ఇప్పటివరకు తాను అధికారంలో లేకున్నా అసెంబ్లీలో, బయట ప్రజల కోసం పొట్లాడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడు పోయానని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అవన్నీ నిరాధార ఆరోపణలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సీమాంధ్ర పెట్టుబడిదారులకు అప్పనంగా కేసీఆర్ సర్కారు లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద జరిగిన దోపిడీ బయటికి రావాల్సిన అవసరం ఉందన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి తీరుతారని వ్యాఖ్యానించారు.