Site icon vidhaatha

భారత్ జోడో యాత్ర: నగరంలో 4 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్క‌డెక్కడంటే

విధాత‌, హైద‌రాబాద్‌: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలోకి ప్రవేశిస్తుంది. దీంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా నాలుగు రోజుల పాటు వెహికల్స్ దారి మళ్లిస్తున్నారు. షాద్​నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 వరకు వరకు వెహికల్స్ డైవర్షన్ ఉంటుంది.

అయితే.. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వెహికల్స్​ను ఒకే లేన్​లో అనుమతిస్తారు. మరో లేన్​లో వచ్చే వెహికల్స్ అమిత్ కాటన్ మిల్, బూర్గుల క్రాస్​రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్ నగర్​వైపు వెళ్లాలని సూచించారు. బెంగళూరు నుంచి షాద్​నగర్​ వైపు వచ్చే వెహికల్స్ కేశంపేట క్రాస్​రోడ్, చటాన్​పల్లి రైల్వే గేట్​ మీదుగా వెళ్లాలి. ఇక పరిగి నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వెహికల్స్ షాద్​నగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేటు మీదుగా హైవే మీదకు చేరుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్ 31న ట్రాఫిక్ డైవర్షన్

శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 31న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వెహికల్స్ పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్​గూడ, గొల్లపల్లి, కిషన్​గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

నవంబర్ 1న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు

బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు తొండుపల్లి టోల్​గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్​ రోడ్, జంక్షన్, ఎయిర్ పోర్డు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, ఓఆర్ఆర్ అండర్​పాస్, గగన్​పహాడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

నవంబర్ 2న బాలానగర్ ట్రాఫిక్‌‌‌‌ పీఎస్ పరిధిలో బోయిన్​పల్లి నుంచి బాలానగర్​ వైపు వెళ్లే వెహికల్స్ బోయిన్​పల్లి జంక్షన్, ఓల్డ్ ఎయిర్ పోర్ట్, గౌతం నగర్, శోభన జంక్షన్, ఫతేనగర్ పైప్​లైన్ రోడ్ మీదుగా బాలానగర్ చేరుకోవాల్సి ఉంటుంది. బాలానగర్ నుంచి బోయిన్ పల్లి వైపు వెళ్లే వెహికల్స్ సైతం ఇదే రూట్ లో వెళ్లాలి.

కూకట్​పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ ట్రాఫిక్ పీఎస్​ల పరిధిలో బాలానగర్ ​నుంచి అంబేద్కర్ వై జంక్షన్ వైపు వచ్చే వెహికల్స్ ఒకే లేన్​లో వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు.

వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు కోరారు.

Exit mobile version