Kamareddy Master Plan | కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ.. హైకోర్టులో రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.
ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే మాస్టర్ ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 25కు వాయిదా వేసింది.
మాస్టర్ ప్లాన్ రద్దు కోసం కామారెడ్డి రైతుల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఆందోళనలో భాగంగా రైతు ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లకు వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకు వినతి పత్రాలు ఇచ్చారు.
ఇందులో భాగంగానే పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లకు వినతి పత్రాలను కమిటీ సభ్యులు అందించారు. పట్టణ బృహత్ ప్రణాళిక ముసాయిదా రద్దు చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్‌లో.. రైతులకు అనుకూలంగా తీర్మానం చేయాలని విన్నవించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌లో భూములు పోవని భరోసా ఇచ్చిన మున్సిపల్ పాలక వర్గ సభ్యులు.. అన్నదాతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.