విధాత: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జాతీయ పార్టీని ప్రకటించ బోతున్నారు. దీంతో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటనపై దేశమంతా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు ఒక రోజు ముందే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దసరా పండుగ చేసుకుంటున్నారు.
అంతే కాదు.. ప్రజలకు కూడా ముందే దసరా పండుగ రుచి చూపిస్తున్నారు. వరంగల్ జిల్లా పరిధిలోని తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు రాజనాల శ్రీహరి.. జనాలకు మద్యం, కోళ్లను పంపిణీ చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించబోతున్న సందర్భంగా, సంతోషంతో మద్యం, కోళ్లను పంపిణీ చేస్తున్నట్లు శ్రీహరి ప్రకటించారు.
సుమారు 200 కోళ్లను, 200 మద్యం బాటిళ్లను పంపిణీ చేసి వార్తల్లో నిలిచారు. ఇక మద్యం, కోళ్ల కోసం జనాలు బారులు తీరారు. మొదటగా పేద హమాలీలకు, అనంతరం సాధారణ జనాలకు మద్యం, కోళ్లను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కంటే ముందు కేసీఆర్ ప్రధాని కావాలని, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.