ఉన్నమాట: బీజేపీ అధిష్ఠానం తెలంగాణ గురించి ఎక్కువగా ఊహించుకున్నది. ముఖ్యంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఆ పార్టీ రాష్ట్రంలో బలోపేతం అవుతున్నదని అనుకున్నది. సంజయ్, రాజాసింగ్ లాంటి నేతలు ఒక వర్గం ప్రజలపై చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో హిందూ ఓట్లన్నీ పోలరైజ్ అవుతాయని దీంతో ఇక్కడ పాగా వేయవచ్చు అని భావించింది.
దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీలో గెలుపుతో రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటున్నది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ చేసే రాజకీయాలు తెలంగాణలో నడవవు అనేది కొంత లేటుగా అర్థమైంది. దీంతో నియోజకవర్గంలో పేరు ఉండి, డబ్బులు ఖర్చు పెట్టుకునే నేతలను చేర్చుకోవడం మొదలుపెట్టింది.
దుబ్బాక, హుజురాబాద్‌లో పార్టీ గెలిచినా.. అక్కడ ఆ పార్టీపై పోటీచేసిన అభ్యర్థులు దశాబ్ద కాలానికి పైగా ఉద్యమకారులుగా తెలంగాణ ప్రజలకు సుపరిచితులు. అందుకే అక్కడ అభ్యర్థులు ముందున్నారు. పార్టీ వారి వెనుక ఉన్నది. అవే ఫలితాలు పునరావృతమౌతాయని అతిగా ఊహించుకున్నది.
ముఖ్యంగా గంగా జెమునా తెహజీబ్ లాంటి ఈ ప్రాంతంలో విద్వేష రాజకీయాలు మొదలుపెట్టింది. అట్లనే గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నదనే ప్రజలకే కాదు మొదటి నుంచి ఉద్యమంలో ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలకు కూడా నచ్చలేదు. బూడిద భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ లాంటి వారు తమ రాజీనామా లేఖల్లో పేర్కొన్న అంశాలను చూస్తే ఆ పార్టీ వ్యవహారం ఎలా ఉన్నదో తెలుస్తుంది.
అందుకే కారు దిగి కమలం కండువా కప్పుకున్న నేతలు పార్టీలో ఇమడలేక, పార్టీలో తమకు లభిస్తున్న ప్రాధాన్యాన్ని సహించలేక బైటికి వస్తున్నారు. నిజానికి హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాతనే టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెప్పారు. కానీ అదేదీ జరగలేదు.
తాజాగా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెబుతున్నారు. బూర నర్సయ్య పార్టీని వీడగానే అధికార పార్టీ నుంచి కర్నె ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్‌ల పేర్లను తెర మీదికి తెచ్చారు. బీజేపీ చేస్తున్న విష ప్రచారాన్ని వాళ్లు ఖండించడంతో బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర బీజేపీలో ముసలం పుట్టించింది. కమలం పార్టీ ని వీడుతున్న నేతల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం మాదే అంటున్న బీజేపీ నేతలకు 119 నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులు దొరుకుతారా? అనే సందేహం కూడా వ్యక్తమవుతున్నది. ఇప్పటికీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనే ఉన్నదన్నది వాస్తవం. దీన్ని విస్మరించి అతి ఊహించుకున్న బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి ప్రస్తుత పరిణామాలు కలవరపరిచేవే.
-ఆసరి రాజు