Site icon vidhaatha

ట్రంప్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తూ కోర్టు తీర్పు

విధాత‌: కొద్ది రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గనున్న వేళ అమెరికా (America) మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) న‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆయ‌న కొల‌రాడోలో జరిగే రిప‌బ్లిక‌న్ ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో పోటీ ప‌డ‌టానికి అన‌ర్హుడ‌ని ఆ రాష్ట్ర సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత ట్రంప్ త‌న అనుచ‌రులను రెచ్చ‌గొట్టి శ్వేత‌సౌధంపై దాడికి ఉసిగొల్పారని ఆరోప‌ణ‌లున్న విష‌యం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించిన విచార‌ణ‌లో భాగంగానే ఈ కోర్టు తీర్పు వెలువ‌డింది.


ప్రైమ‌రీ ఎన్నిక‌ల వ‌ర‌కే ఈ అన‌ర్హ‌త అని ఈ తీర్పులో చెప్పిన‌ప్ప‌టికీ.. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా ట్రంప్‌ను నిషేధించ‌డ‌మే ఈ తీర్పు ఉద్దేశంగా క‌న‌ప‌డుతోంది. ఈ నిర్ణ‌యాన్ని సుప్రీం కోర్టులో వ‌చ్చే నెల అప్పీలు చేస్తామ‌ని ట్రంప్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వెల్ల‌డించారు. గ‌తంలో ఏ అధ్య‌క్షుడూ చేయ‌ని విధంగా ఒక బాధ్య‌తాయుత‌మైన ప‌దవిలో ఉంటూ ట్రంప్‌.. తిరుగుబాటును లేవ‌దీశార‌ని కొల‌రాడో అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది.


అందుకే తొలిసారి ఒక మాజీ అధ్య‌క్షుడిపై ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి వ‌స్తోంద‌ని 4-1 మెజారిటీతో త‌న నిర్ణ‌యాన్ని చెప్పింది. సాంకేతికంగా మార్చ్ 5న కొల‌రాడోలో జ‌రిగే రిప‌బ్లిక‌న్ ప్రైమ‌రీ ఎన్నిక‌లకే ఈ తీర్పు వ‌ర్తిస్తున్న‌ప్ప‌టికీ.. న‌వంబ‌రు 5న జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కూ ట్రంప్ అన‌ర్హుడిగా మారే ప్ర‌మాదముంది. ఈ తీర్పుపై ట్రంప్ బృందం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇది ప్ర‌జాస్వామ్య వ్య‌తిరేక తీర్పు అని త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ‘కొల‌రాడ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా దారుణం. మేము వెంట‌నే దీనిని అమెరికా సుప్రీం కోర్టులో స‌వాలు చేయ‌నున్నాం’ అని ట్రంప్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు ప్ర‌క‌టించారు.


రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థిత్వం కోసం పోటీప‌డుతున్న వివేక్ రామ‌స్వామి సైతం ఈ తీర్పుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తీర్పును రాజ్యాంగ వ్య‌తిరేకంగా అభివ‌ర్ణించిన ఆయ‌న.. ట్రంప్ లేక‌పోతే తానూ కొల‌రాడో ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోన‌ని ప్ర‌క‌టించారు. ఇత‌ర పోటీదారులు కూడా ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకోవాల‌ని.. లేదంటే దేశంలో అనేక విప‌రిణామాలు సంభ‌విస్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Exit mobile version