TS BUDGET SESSION HIGH COURT
- గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు
విధాత: గవర్నర్‌తో సర్కార్ రాజీకి వచ్చింది. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదంటూ కోర్టుకెక్కిన రాష్ట్ర ప్రభుత్వం.. అనూహ్యంగా వెనుకడుగు వేసింది. గవర్నర్ పై వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను వాపసు తీసుకున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం అమవుతాయని కోర్టుకు హామీ ఇచ్చింది. వాస్తవానికి ఈ నెల 3 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉన్నది. కానీ.. గవర్నర్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపక పోవడంతో ప్రభుత్వ వర్గాల్లో టెన్షన్ మొదలైంది.
గవర్నర్ అనుమతి కోరుతూ జనవరి 21వ తేదీనే లేఖ పంపారు. అయితే.. సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా? అనే ప్రశ్నతో గవర్నర్ కార్యాలయం నుంచి తిరుగు టపా అందింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పందన తెలియజేయక పోవడంతో గవర్నర్ కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించాలని సర్కార్ నిర్ణయించింది. వాదనల సమయంలో హైకోర్టు చేసిన సూచనలతో ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే, రాజ్‌భవన్ న్యాయవాది అశోక్ ఆనంద్ మధ్య చర్చలు జరిగాయి. చర్చల్లో పరిష్కారం లభించిందని ఇద్దరు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని చర్చల్లో నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగానికి అంగీకరించినట్టు ఇరుపక్షాల న్యాయవాదులు తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిస్తారని పేర్కొన్నారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణను ముగించింది. ప్రభుత్వం తరఫున వాదించిన దుష్యంత్ దవే.. గవర్నర్‌ను విమర్శించ వద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని కోర్టుకు తెలిపారు.
మళ్లీ నోటిఫికేషన్?
గవర్నర్ ప్రసంగం ఉండే పక్షంలో తాజాగా సమావేశాలపై నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 3వ తేదీనే సమావేశాలు మొదలవుతాయా? అన్న అంశంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. మరోవైపు.. ఆరవ తేదీన బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయనే వాదన వినిపిస్తున్నది.