TS Group-1 | ఈ నెల 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరుగనున్నది. ఈ ఎగ్జామ్ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రిలిమ్స్‌కు సంబంధించిన హాల్ టికెట్లను ఆదివారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల కాగా.. ప్రిలిమ్స్ నిర్వహించగా.. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్-1 పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో మళ్లీ ప్రిలిమ్స్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 11న పరీక్ష జరుగనున్నది. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్ కోసం డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ల మళ్లీ పని చేయవని, కొత్తగా tspsc.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. ఇక ఈ నెల 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరుగనున్నది. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రూప్-1 కోసం 3.8లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించడంతో పాటు ఫలితాలను ప్రకటించింది. ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పరీక్ష రద్దు చేసి మళ్లీ క్తొత తేదీలను ప్రకటించింది. గతంలో పరీక్ష నిర్వహణకు ముందే పేపర్ లీక్ అవ్వడం, బ్లూటూత్ పరికరాలు, ఇతర టెక్నాలజీతో పరీక్షల్లో చీటింగ్ చేసిన విషయాలు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలో ఈసారి పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులను రెండంచెల్లో తనిఖీలు చేయనున్నారు. మెటల్ డిటెక్టర్లు, ఇతర పద్ధతుల్లో ప్రతి అభ్యర్థిని రెండు బృందాలు రెండుసార్లు పరిశీలించినున్నాయి. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.
అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాల వద్దకు గంట ముందుగానే చేరుకోవాలని కమిషన్ సూచించింది. అభ్యర్థులను తనిఖీ చేసిన తరువాత వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నది. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన అభ్యర్థి నిజమైన వ్యక్తి అవునో కాదో బ్లాక్‌చైన్ టెక్నాలజీతో తనిఖీ చేయనున్నారు.