TSPSC । నిరుద్యోగుల జీవితాల‌తో టీఎస్‌పీఎస్సీ చెల‌గాటం..! గ్రూప్‌-1లో 103 మార్కులు ఎలా సాధ్యం..?

పేరుకు నోటిఫికేషన్లు.. పరీక్షలు అన్నీ అపసవ్యం.. లొసుగుల మయం తాజాగా పేపర్‌ లీకేజీ వార్తలతో కలకలం రాష్ట్ర సర్కార్‌పై నిరుద్యోగుల ఆగ్రహం TSPSC । టీఎస్‌పీఎస్సీ.. తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒకటైన నియామకాలను సాకారం చేసేందుకు ఉద్దేశించిన విభాగం. కానీ.. అత్యంత కీలకమైన టీఎస్‌పీఎస్సీ పనితీరు ఏ రోజూ సంతృప్తికరంగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు నోటిఫికేషన్లు వస్తున్నా.. వాటిని పకడ్బందీగా ఇవ్వకపోవడంతో కోర్టు కేసులు ఆ ప్రక్రియను జాప్యం చేస్తున్నాయి. పరీక్షలు నిర్వహించినా.. నిర్లక్ష్యాలు, పేపర్‌ […]

  • Publish Date - March 14, 2023 / 10:34 AM IST

  • పేరుకు నోటిఫికేషన్లు.. పరీక్షలు
  • అన్నీ అపసవ్యం.. లొసుగుల మయం
  • తాజాగా పేపర్‌ లీకేజీ వార్తలతో కలకలం
  • రాష్ట్ర సర్కార్‌పై నిరుద్యోగుల ఆగ్రహం

TSPSC టీఎస్‌పీఎస్సీ.. తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒకటైన నియామకాలను సాకారం చేసేందుకు ఉద్దేశించిన విభాగం. కానీ.. అత్యంత కీలకమైన టీఎస్‌పీఎస్సీ పనితీరు ఏ రోజూ సంతృప్తికరంగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు నోటిఫికేషన్లు వస్తున్నా.. వాటిని పకడ్బందీగా ఇవ్వకపోవడంతో కోర్టు కేసులు ఆ ప్రక్రియను జాప్యం చేస్తున్నాయి. పరీక్షలు నిర్వహించినా.. నిర్లక్ష్యాలు, పేపర్‌ లీకేజీలు వాటిని బొందబెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏఈ, గ్రూప్‌ 1 ప్రశ్నాపత్రాల లీకేజీ విద్యార్థులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి.

విధాత: ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్ణాల పోరాట ఫ‌లితంగా ఏర్ప‌డింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (Telangana State Formation)లో విద్యార్థి లోకం కీల‌క పాత్ర పోషించింద‌న‌డంలో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేదు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌కాల్లో తెలంగాణ వారికి తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని, త‌మ‌కు ఉద్యోగాలు ద‌క్క‌డం లేద‌నే ఆవేద‌న‌తో విద్యార్థులు ఉద్య‌మంలో క‌దం తొక్కారు. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం రాజ‌కీయ పార్టీల కంటే విద్యార్థులే.. నిర్విరామంగా పోరాడారు. తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల‌కు చెందిన విద్యార్థులు రాజీలేని పోరాటం చేయ‌డం కార‌ణంగానే ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డింది. ఇది నగ్న స‌త్యం. రాజ‌కీయ పార్టీలు కూడా చాలా సంద‌ర్భాల్లో ఒప్పుకొన్న ప‌రిస్థితి.

కల నెరవేరిందా?

తాము దేని కోస‌మైతే పోరాడామో ఆ క‌ల స్వ‌రాష్ట్రంలో నెర‌వేర‌డం లేదన్న ఆవేదన విద్యార్థి లోకం వ్యక్తం చేస్తున్నది. 2014 నుంచి నేటి వ‌ర‌కు నిరుద్యోగుల వ్య‌థ‌లు అన్నీ ఇన్నీ కావు. ఉద్యోగాల భ‌ర్తీ (Recruitments) చేప‌ట్ట‌క‌పోవ‌డం, చేప‌ట్టినా కోర్టు కేసుల‌తో పెండింగ్‌లో ఉండ‌టం వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని నిరుపేద విద్యార్థులు రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్‌ (Hyderabad) లో అర్ధాక‌లితో అల‌మ‌టిస్తూ.. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నారు. ఈ పోటీ ప్ర‌పంచంలో నెగ్గేందుకు నిద్ర‌ల్లేని రాత్రులు గడుపుతూ.. పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించిన త‌ర్వాతే త‌మ ఊర్లల్లో అడుగుపెట్టాల‌నే సంక‌ల్పంతో క‌సితీరా చ‌దువుతున్నారు. కానీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం.. నియామ‌క సంస్థ‌ల నిర్వాకం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామని నిరుద్యోగ యువత (Unemployed Youth) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణే ఏఈ, గ్రూప్-1 ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ.

స‌ర్కార్ కొలువుల‌ కోసం.. త‌ల్లుల పుస్తెల తాళ్లు కుద‌వ‌పెట్టి..

తన బిడ్డ స‌ర్కార్ కొలువు సాధించాల‌నే త‌ప‌న‌తో తమ బంగారు పుస్తెల‌ను కుదవ‌పెట్టి ప‌ట్నానికి పంపిన, పంపుతున్న‌ తల్లులు ఎందరో. అంతే కాదు.. కోచింగ్‌ల కోసం, వ‌స‌తి గృహాల్లో ఉండేందుకు ల‌క్ష‌ల రూపాయలు అప్పులు చేసి.. ప‌ట్నానికి పంపిన‌, పంపుతున్న తండ్రులు ఎందరో. ఈ త‌ల్లిదండ్రుల ఆశ‌య‌మంతా ఒక్క‌టే.. త‌మ బిడ్డలు స‌ర్కార్ నౌక‌రీ (Gvoernment Job) కొట్టాల‌నేదే. అలా త‌ల్లిదండ్రులు పంపిన పైస‌ల‌తో హైద‌రాబాద్ న‌గ‌రంలో కోచింగ్‌లకు వెళ్తూ.. స్ట‌డీ హాల్స్‌లో చ‌దువుకుంటూ.. పుస్త‌కాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు.

ఉద్యోగాలు లేక‌.. పెళ్లిళ్లు కాక‌..

ఎన్నో అడ్డంకుల‌ను అధిగ‌మించి స‌ర్కార్ కొలువు కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఉద్యోగార్థుల జీవితాలు అంధ‌కారంలో మగ్గిపోతున్నాయి. నోటిఫికేష‌న్లు (Notifications) వెలువ‌డిన‌ప్ప‌టికీ.. స‌మ‌యానికి ఉద్యోగాల భ‌ర్తీ చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పెళ్లి చేసుకుందామంటే.. వ‌య‌సు పైబ‌డిపోవ‌డం.. ఉద్యోగం లేక‌పోవ‌డం. ఇన్ని ఆందోళ‌న‌ల మ‌ధ్య అయోమయానికి గురవుతున్న నిరుద్యోగులు ప్రభుత్వ చర్యలతో ఆగమవుతున్నారు.

ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీల‌తో అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న‌..

గ‌త ఏడేండ్ల నుంచి నోటిఫికేష‌న్లు ఇవ్వ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కంటితుడుపు చ‌ర్య‌గా.. ఎన్నిక‌ల ఏడాదిని దృష్టిలో ఉంచుకుని దాదాపు 80 వేల ఉద్యోగాల భ‌ర్తీకి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో ఇప్ప‌టికే వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు జారీ అయ్యాయి. ప‌లు ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌లు కూడా జ‌రిగిపోయాయి. ఫ‌లితాలు రావ‌డమే మిగిలింది.

మ‌రికొన్ని ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌లు జ‌రగాల్సిన స‌మ‌యంలోనే టీఎస్‌పీఎస్సీలో ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారం వెలుగు చూసింది. అసిస్టెంట్ ఇంజినీర్ ప్ర‌శ్నాప‌త్రం లీక్‌ అయింద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు రావ‌డంతో.. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్‌సీర్, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల‌కు సంబంధించిన రాత‌ప‌రీక్ష‌ల‌ను టీఎస్‌పీఎస్సీ ర‌ద్దు చేసింది. అంతే కాకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్ర‌శ్నాప‌త్రం కూడా లీకైన‌ట్లు టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.

ప్ర‌వీణ్‌కు అంత ప్ర‌తిభ ఉందా? గ్రూప్‌-1లో 103 మార్కులు ఎలా సాధ్యం?

టీఎస్‌పీఎస్సీ సెక్ర‌ట‌రీకి పీఏగా ప‌ని చేస్తున్న ప్ర‌వీణ్‌.. ఏఈ (AE), టీపీబీవో (TPBO) ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీలో కీల‌క‌పాత్ర పోషించిన‌ట్లు పోలీసులు తేల్చారు. దీంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు.. గ‌తంలో జ‌రిగిన రాత‌ప‌రీక్ష‌ల ప్ర‌శ్నాప‌త్రాలు కూడా లీక‌య్యాయా? అనే అంశంపై దృష్టి సారించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ (Group 1 Prelims)లో 150 మార్కుల‌కు గాను 103 మార్కులు సంపాదించిన ప్ర‌వీణ్‌కు అంత ప్ర‌తిభ ఉందా? అని అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే అత‌ని ఓఎంఆర్ షీట్‌ను టీఎస్‌పీఎస్సీ అధికారులు క్షుణ్ణంగా ప‌రిశీలించారు. హాల్ టికెట్ నంబ‌ర్‌ను స‌రిగా బ‌బ్లింగ్ చేయ‌కపోవ‌డంతో.. ప్ర‌వీణ్ క్వాలిఫై కాలేద‌ని అధికారులు చెప్పారు. ప్ర‌వీణ్‌కు 103 మార్కులు రావ‌డంతో ఆ పేప‌ర్ కూడా లీకై ఉండొచ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. ఇంకా ఇత‌ర రాత‌ప‌రీక్ష‌ల పేపర్లు కూడా లీక్ అయ్యాయా? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డెక్కిన ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు..

టీఎస్‌పీఎస్సీ భ‌ర్తీ చేస్తున్న ప‌లు ఉద్యోగ నియామ‌కాలకు సంబంధించిన రాత‌ప‌రీక్ష‌ల ప్ర‌శ్నాప‌త్రాలు లీక్ అయ్యాయ‌ని తేల‌డంతో ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కారు. త‌ల్లుల పుస్తెల తాళ్లు కుద‌వ‌పెట్టి, అప్పులు చేసి ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం చ‌దువుతుంటే, ఇలాంటి ప‌రిణామాలు చాలా బాధ‌ను క‌లిగిస్తున్నాయ‌ని నిరుద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌కు టీఎస్‌పీఎస్సీ అధికారులు, ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీకి కార‌ణ‌మైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని, నిరుద్యోగుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Latest News