విధాత: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో ప్రశ్నపత్రాలు ఇంకా ఎన్ని చేతులు మారాయి? అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాల సేకరణపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన 9 మందిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
వీరిలో ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్‌లను, రాజేంద్రనాయక్‌లను మరోసారి ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది. బుధవారం అరెస్టైన షమీమ్, రమేష్, సురేష్‌లను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు కోర్టు నిర్ణయం తీసుకోనున్నది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100పైగా మార్కులు వచ్చిన 121 మందిని సిట్ అధికారుల విచారిస్తున్నారు. శుక్రవారం వరకు దాదాపు 40 మందిని ప్రశ్నించినట్లు సమాచారం. వీరిలో పరీక్ష తీరు, ప్రశ్నల శైలిపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు షమీమ్, సురేశ్, రమేష్‌లు తడబడి పొంతనలేని సమాధానాలు ఇచ్చి దొరికిపోయినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన సాక్షిగా కమిషన్ కాన్ఫిడెన్సియల్ విభాగం సూపరింటెండెంట్ బి. శంకరలక్ష్మి నుంచి సిట్ అధికారులు వాంగ్మూలం సేకరించారు. అలాగే సర్వీస్ కమిషన్‌లో జూనియర్ అసిస్టెంట్ కె. అనురాజ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సాఫ్ట్‌వేర్ డెవలపర్ బి. హరీశ్‌కుమార్ నుంచి సాక్ష్యాలు సేకరించారు.
మరొకరి అరెస్ట్
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరొకరి అరెస్టయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట ఉపాధి మామీలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది. రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. గ్రూప్-1 పరీక్ష పేపర్ కొనుగోలు చేసిన ప్రశాంత్ 100పైగా మార్కులు తెచ్చుకున్నట్టు సిట్ ఆధారాలు సేకరించింది.