విధాత: ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో, డిజిటల్ మీడియా రంగంలో ప్రభంజనం సృష్టించిన షో ఏదైనా ఉందంటే అది అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె. ఈ షోకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విధానం పలువుని ఆకట్టుకుంది. దాంతో ఈ షోకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇప్పటికే ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక తాజాగా వీరసింహారెడ్డి టీంతో ఒక ఎపిసోడ్‌ను షూట్ చేశారు. శృతిహాసన్‌తో కూడా ఒక ఎపిసోడ్‌ను చేసినట్లుగా తెలుస్తుంది.
ఈ షోలోకి శృతిహాసన్ తండ్రి కమలహాసన్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వంటి వారు కూడా ముఖ్య అతిథులుగా రానున్నారని సమాచారం. ఈ షో ద్వారా యూత్ ఆడియన్స్‌కి బాలయ్య బాబు బాగా దగ్గరయ్యాడు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే బాలయ్య బాబులో ఇంత ఫన్ యాంగిల్ ఉందా? అనిపించేంతగా ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ ప్రభావం ఆయన ఓవర్సీస్ మార్కెట్‌పై కూడా పడింది.
ఇంతకాలం ఓవర్సీస్‌లో బాలయ్యకు సరైన మార్కెట్ లేదు. కానీ ఈ టాక్ షో తర్వాత బాలయ్యకు ఓవర్సీస్‌లో మార్కెట్ పెరిగింది. ఈ టాక్ షోని దేశ విదేశాలలో తెలుగు వారందరూ విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విభజించి స్ట్రీమింగ్ చేశారు.
కొద్ది రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కూడా ఓ ఎపిసోడ్‌ను షూట్ చేశారు. ఈ ఎపిసోడ్ సంక్రాంతికి టెలికాస్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ స్థానంలో వీరసింహారెడ్డి యూనిట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దాంతో పవన్ ఎపిసోడ్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రసారం చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ ఫిబ్రవరి వరకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సీజన్‌ను పవన్‌తో ముగించాలని ఆహా భావిస్తోంది. అందుకే తొందరగా కాకుండా కాస్త ఆలస్యంగా విడుదల చేయాలని ఆహా యూనిట్ ఆలోచిస్తోంది. మొత్తానికి పవన్ ఎపిసోడ్‌ను చూడాలనుకునే వారు మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు. దాంతో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న పవన్ అభిమానులకు కాస్త నిరాశ ఎదురైందనే చెప్పాలి.