డైప‌ర్‌లో 17 బుల్లెట్లు లభ్యం.. షాకైన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ

ఓ డైప‌ర్‌లో 17 బుల్లెట్లు ల‌భ్య‌మ‌య్యాయి. దీంతో ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ షాక్ అయ్యారు. ఈ ఘ‌ట‌న న్యూయార్కులోని లాగార్డియా ఎయిర్‌పోర్టులో బుధ‌వారం వెలుగు చూసింది

  • Publish Date - December 21, 2023 / 11:40 AM IST

న్యూయార్క్ : వినియోగించిన ఓ డైప‌ర్‌లో 17 బుల్లెట్లు ల‌భ్య‌మ‌య్యాయి. దీంతో ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ షాక్ అయ్యారు. ఈ ఘ‌ట‌న న్యూయార్కులోని లాగార్డియా ఎయిర్‌పోర్టులో బుధ‌వారం వెలుగు చూసింది. ఈ విష‌యాన్ని ట్రాన్స్‌పోర్టేష‌న్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేష‌న్ (TSA) ధృవీక‌రించింది. అర్కాన‌స్‌కు చెందిన ఓ ప్ర‌యాణికుడు చికాగో బ‌య‌ల్దేరేందుకు లాగార్డియా ఎయిర్‌పోర్టుకు వ‌చ్చాడు. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ చెక్‌పాయింట్ వ‌ద్ద‌ అత‌ని ల‌గేజీని ఎక్స్ రే యంత్రం ద్వారా చెక్ చేశారు. దీంతో డైప‌ర్‌లో దాచిన 17 బుల్లెట్లు ల‌భ్య‌మ‌య్యాయి. దీనిపై ఆ ప్ర‌యాణికుడిని సెక్యూరిటీ సిబ్బంది ప్ర‌శ్నించ‌గా, ఆ బుల్లెట్లు ఎలా వ‌చ్చాయో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ పెట్టి ఉండొచ్చ‌ని కాసేప‌టికి ప్ర‌యాణికుడు చెప్పారు. ల‌భించిన బుల్లెట్ల‌న్నీ 9 ఎంఎం బుల్లెట్లు అని పోలీసులు తేల్చారు.


అమెరికాలోని ఎయిర్‌పోర్టుల్లో బుల్లెట్లు ల‌భ్యం కావ‌డం ఇదే తొలిసారి కాదు. చాలా సంద‌ర్భాల్లో గ‌తంలో కూడా ప్ర‌యాణికుల నుంచి బుల్లెట్లు ల‌భ్య‌మైన‌ట్లు పేర్కొన్నారు. నెల రోజుల క్రితం ఇదే లాగార్డియా ఎయిర్‌పోర్టులో ఓ ప్ర‌యాణికుడు ఏ.45 కాలిబ‌ర్ పిస్తోల్, ఆరు బుల్లెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నైక్ షూలో ధ‌రించి త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 22 కాలిబ‌ర్ గ‌న్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు బాక్సుల్లో దాచి త‌ర‌లిస్తున్న 100కు పైగా బుల్లెట్ల‌ను సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. 2021, జ‌న‌వ‌రి నెల‌లో ఓ ప్ర‌యాణికుడు చూయింగ్ గ‌మ్ ప్యాకెట్ల‌లో దాచి ఉంచి త‌ర‌లిస్తున్న 13 బుల్లెట్ల‌ను సీజ్ చేశారు.

Tags:  

Latest News