విధాత: భారత్‌లోని నక్సలైట్ల చేతికి అమెరికా ఆయుధాలు రావడం పోలీసు వర్గాల్లో కలవరం సృష్టిస్తున్నది. ఏవిధంగా నక్సలైట్లకు అమెరికా నుంచి ఆయుధాలు వచ్చాయా అని ఆరా తీస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలైట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. నక్సల్స్‌కు ఆయుధాలు, డబ్బులు సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారు.
ఫారెస్ట్ సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేశారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ప్రశ్నిస్తున్నారు. మరో వైపు అటవీ ప్రాంతాల్లో, సరిహద్దుల్లో, సరిహద్దు పట్టణాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. అయినా నక్సల్స్ చేతికి అమెరికా నుంచి అత్యున్నత ఆయుధాలు ఎలా వచ్చాయని అధికారులు ఖంగుతింటున్నారు.
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఈ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నక్సల్స్ వద్ద దొరికిన ఆయుధాల్లో అమెరికాలో తయారైనవి ఉన్నట్లుగా చత్తీస్ ఘడ్ పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్నఆయుధం అమెరికా ఎం1 కార్బన్ తుపాకి అని సదరు పోలీస్ అధకారి పేర్కొన్నారు.
ఈ తుపాకి అమెరికా సైన్యానికి చెందినదై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుపాకి ఏ విధంగా దేశంలోకి వచ్చిందని పోలీసులు ఆశ్యర్యపోతున్నారు. ఇదే సమయంలో అమెరికా నుంచి ఎన్ని ఆయుధాలు నక్సల్స్‌కు చేరాయి? ఏవిధంగా చేరాయి? వాటిని ఎవరు తీసుకు వస్తున్నారు? అనే కోణాలలో చత్తీస్ ఘడ్ పోలీసులు ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.