Vande Bharat Express |
వందే భారత్ రైలుకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుండడంతో మరిన్ని మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వేశాఖ ఏర్పాటు చేస్తున్నది. సెమీ హై స్పీడ్ రైలు ఇప్పటికే పలు రాష్ట్రాలు, నగరాలను కవర్ చేస్తూ 15 మార్గాల్లో పట్టాలక్కాయి. దేశవ్యాప్తంగా మరో ఐదు రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఇందులో తొలి రైలు పూరీ – హౌరా మార్గాల్లో ప్రారంభించనున్నది. ఈ నెలలోనే రైలు పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
ఒడిశాలో ప్రారంభించనున్న మొదటి సెమీ హైస్పీడ్ రైలు కాగా.. సౌత్ ఈస్టర్న్ పరిధిలో అందుబాటులోకి రానున్న రెండోరైలు ఇది. ఇంతకు ముందు న్యూ జాల్పాయ్‌గురి – గౌహతి మార్గంలో రైలు నడుస్తున్నది. ప్రస్తుతం పూరీ – హౌరా మధ్య ట్రయల్ రన్ నిర్వహించగా.. విజవంతమైంది. ఆ తర్వాత భువనేశ్వర్-హైదరాబాద్, పూరీ-రాయ్‌పూర్, పూరీ-హౌరా మార్గాల్లో మరిన్ని సెమీ-హై-స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
పూరీ – హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి 5.50 గంటలకు బయలుదేరి ఉదయం 11.50 గంటలకు చేరుతుందని, తిరుగు ప్రయాణంలో పూరీలో 2 గంటలకు బయలుదేరి రాత్రి 7.30 గంటలకు హౌరా చేరుకోనున్నట్లు సమాచారం.
కుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ , జాజ్‌పూర్ కియోంజహర్ రోడ్, భద్రక్, బాలాసోర్, హల్దియా స్టేషన్లలో రైలు ఆగనున్నట్లు తెలుస్తున్నది. చైర్‌కార్‌కు రూ.1590, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.2,815 వరకు టికెట్ ధర ఉండనున్నట్లు అంచనా.