Site icon vidhaatha

‘Vidhaatha’ Effect’ | ఆ.. ‘వసంత’పై కేసు.. మరో ముగ్గురిపైనా నమోదు

‘Vidhaatha’ Effect’

విధాత, హైదరాబాద్: ధరణిలో లొసుగులను అడ్డం పెట్టుకొని ఢిల్లీ ఆధార్, ఓల్డ్ సిటీ సిమ్ కార్డుతో కొండమడుగులో గుర్తు తెలియని వసంతకు సంబంధించిన 10 ఎకరాలను స్వాహా చేసేందుకు ప్రయత్నించిన ‘వసంత’పై బీబీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాలతో ధరణిలో పుట్టుకొచ్చిన వసంతతో పాటు ఇందులో భాగస్వామ్యం ఉన్న మరో ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు.

ఒకే భూమిపై నలుగురు వసంతలు వచ్చిన విషయంపై ‘దారి తప్పిన ధరణి’ శీర్షికతో ఈ నెల 9వ తేదీన విధాతలో కథనం ప్రచురించిన సంగతి విదితమే. ఈ కథనం భువనగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో బీబీ నగర్ మండల రెవెన్యూ అధికారులు దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించారు.

ఇది తమ తాత భూమి అని, తమ భూమిని నకిలీ పత్రాలతో కొల్లగొట్టిన వసంతపై చర్యలు తీసుకోవాలని రాంపల్లి రమేశ్‌ అనే వ్యక్తి బీబీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ఢిల్లీ ఆధార్‌ కార్డు కలిగిన వసంతతో పాటు.. పాత్రధారులుగా భావిస్తున్న బీఆర్ఎస్ నాయకులు మండ నాగేంద్ర బాబు, పంజాల నాగరాజు, కురుమిడ్ల భాస్కర్లపై 420, 468, 471, రెడ్ /విత్ 34 సెక్షన్ల కింద బీబీ నగర్ పోలీసులు కేసు (ఎఫ్ఐఆర్ నెంబర్-263 2128) నమోదు చేశారు.

Dharani | దారి తప్పిన ధరణి.. ఢిల్లీ ‘ఆధార్’.. ఉప్పుగూడ ‘సిమ్‌కార్డ్‌’.. 10 ఎకరాలు మటాష్

విధాత కథనంపై విజిలెన్స్ అధికారులు కూడా వసంత గురించి స్థానికంగా (బీబీ నగర్‌లో) ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో అసలు సూత్రధారులను తప్పించారని ముదిరాజ్ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్టల అశోక్ ఆరోపించారు.

భువనగిరి ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతూ.. రూ.50కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టడంలో కీలకంగా వ్యవహరించిన వాళ్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని, ధరణిలో జరిగిన రిజిస్ట్రేషన్లను, జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version