Site icon vidhaatha

ఎవరేమ‌నుకున్నా విమోచ‌న దినం నిర్వ‌హిస్తాం: అమిత్‌షా

విధాత: కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్‌ ప‌రేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచ‌న దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జలంద‌రికీ విమోచ‌న దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ..

ఈ రోజు ఎవ‌రైతే సెప్టెంబ‌ర్ 17ను హైద‌రాబాద్ విమోచ‌న దినోత్స‌వంగా పిల‌వ‌డానికి సిగ్గు ప‌డుతున్నారో వారంద‌రికీ ఒక‌టి చెప్ప‌ద‌లుచుకున్నారు. వేలాది మంది పోరాట త్యాగాల ఆధారంగా అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు మీరు శ్ర‌ద్ధాంజ‌లి ప్ర‌క‌టించ‌క‌పోతే వారికి ద్రోహం చేసిన‌ట్లే అన్నారు.

ఉక్కు మనిషి సర్దార్ పటేల్ తన దృఢ సంకల్పం, అద్భుతమైన పరిపాలనా నైపుణ్యంతో స్వతంత్ర మరియు అఖండ భారత్ కోసం అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆపరేషన్ పోలో నిర్ణయం తీసుకుని, క్రూరమైన నిజాం సైన్యాన్ని పోలీసు చర్యతో ఓడించి ప్రజలను నిజాం పాలన నుండి విముక్తి చేయడానికి కృషి చేశాడని అన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లు ఇక్కడ పాలించిన పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడానికి సాహసించలేదన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆమోదంతో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం ద్వారా ఇక్కడి ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చామని అన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న స్వాంతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు..

ఏ ఉద్దేశాల‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిందో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాటిని మ‌రిచిపోతే వారిని ప్ర‌జ‌లు మ‌రిచిపోరని, ప్ర‌ధాని మోడీ ఏ విధంగా దేశాన్ని ర‌క్షిస్తున్నారో దేశాన్నిఅభివృద్ధి ప‌థంలో తీసుకెళ్లేందుకు ముందుకు వెళ్తున్నారో, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించేందుకు అమృత్ మ‌హోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారో ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ య‌థావిధిగా కొన‌సాగుతాయన్నారు.

ఈ హైద‌రాబాద్ విమోచ‌న దినోత్స‌వం కూడా అదే రీతిలో జ‌రుగుతుంద‌న్నారు. ఎవ‌రు వ‌ద్ద‌న్నా.. ఏమ‌ను కున్నా కేంద్ర ప్ర‌భుత్వం ధైర్యంగా విమోచ‌న దినోత్స‌వాలు ధైర్యంగా నిర్వ‌హిస్తుందన్నారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయబడ్డాయని వ్యాఖ్యానించారు. నిజం పాలనలో అరాచకా లు కొనసాగాయన్నారు. ప్రజలంతా ఏ భయం లేకుండా వేడులకు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు ఓటు బ్యాంకు రాజకీయాలతోనే వేడుకలను నిర్వహించలేదని విమర్శించారు. ఇప్పటికీ కొందరు వేడుకలు చేయాలంటే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఎంతో మంది తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించారంటూ వారికి జోహార్లు అర్పించారూ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే.. కర్ణాటక మంత్రి శ్రీరాములు నాడు పటేల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. కేంద్రం అధికారికంగా ఈ వేడకలను నిర్వహించాన్ని అభినందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాడు 74 ఏళ్ల క్రితం పటేల్ తెలంగాణ గడ్డ పైన జాతీయ పతాకం ఆవిష్కరిస్తే..ఇప్పుడు హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారని చెప్పుకొచ్చారు.

స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణపతాకం ఎగరవేస్తుంటే ఆనాడు నిజాం ప్రభువు అడ్డుకున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేసారు. తెలంగాణ గడ్డపై జాతీయ జెండా ఎగరవేసేందుకు ఎందరో ప్రాణాలు అర్పించాంటూ వారి త్యాగాలను స్మరించుకున్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణలో స్వాంతంత్య్ర వేడుకలను గత ప్రభుత్వాలు జరపలేదని విమర్శించారు.

అంతకు ముందు అమిత్ షా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.జాతీయ గీతాలాపన అనంతరం అమిత్ షా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమిత్ షా రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

తెలంగాణ విమోచన వేడుకల్లో సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఆర్‌ఏఎఫ్ వంటి మొత్తం 7 కేంద్ర బలగాలు కవాతును నిర్వహించాయి.. 12 ట్రూపులు, 1300 మంది కళాకారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక, ఈ కార్యక్రమం తరువాత పార్టీ సమావేశాలు.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాల్లో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

అంతకు ముందు అమిత్‌షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీని సందర్శించి అక్కడున్న అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

Exit mobile version