విధాత: కార్లు, ద్విచక్రవాహనాల ఆశ చూపి మునుగోడు ప్రజలను ప్రలోభ పెట్టడానికి బీజేపీ యత్నిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం క్షుద్రపూజలు చేస్తున్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాంత్రిక విద్యలపై కోర్సులు ప్రవేశపెట్టింది బీజేపీనే అని అన్నారు.
ఉప ఎన్నికలో ప్రజలకు చెప్పేది ఏమీ లేక దివాళాకోరు, దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నది. వాళ్ల నోటికి మొక్కాలి.. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. గతంలోనే మునుగోడు ప్రజలను మోసం చేశారు. మునుగోలులో ప్రజలు గెలవాలా? రాజగోపాల్‌రెడ్డి ధనం గెలవాలా? అని ప్రశ్నించారు.
కోట్లు ఖర్చుపెట్టినా బీజేపీకి ఓటమి తప్పదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన ఘతన తమది అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చి అమలు చేస్తున్నది. కాబట్టి మనుగోడు ప్రజలు అభివృద్ధికే పట్టం గడుతారని మంత్రి తెలిపారు.