MLA Rajaiah | ఎమ్మెల్యే రాజయ్య పయనం ఎటువైపు? కలకలం సృష్టిస్తున్న ప్రకటనలు

MLA Rajaiah | ‘మాదిగ’ల మద్ధతు పై పూర్తి భరోసా రంగంలోకి మంద కృష్ణ మాదిగ కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు తనకే అవకాశమొస్తుందని విశ్వాసం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టికెట్ దక్కని స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నారు.అధిష్టానానికి అసమ్మతిని ప్రకటిస్తూనే నియోజకవర్గాన్ని, ప్రత్యక్ష రాజకీయాలను వీడేదిలేదని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తనకు నమ్మకం ఉంటుందంటూనే నియోజకవర్గంలో పట్టుబిగిస్తున్నారు. అనుచరుల నుంచి […]

  • Publish Date - August 31, 2023 / 01:22 AM IST

MLA Rajaiah |

  • ‘మాదిగ’ల మద్ధతు పై పూర్తి భరోసా
  • రంగంలోకి మంద కృష్ణ మాదిగ
  • కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు
  • తనకే అవకాశమొస్తుందని విశ్వాసం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టికెట్ దక్కని స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నారు.అధిష్టానానికి అసమ్మతిని ప్రకటిస్తూనే నియోజకవర్గాన్ని, ప్రత్యక్ష రాజకీయాలను వీడేదిలేదని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తనకు నమ్మకం ఉంటుందంటూనే నియోజకవర్గంలో పట్టుబిగిస్తున్నారు. అనుచరుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రాజయ్యకు జరిగిన అవమానికి తగిన విధంగా ప్రతిస్పందించాలని నమ్మకస్తులు ఒత్తిడి చేస్తున్నారు.

బలం, బలగం ఉండి మౌనం వహించడం సరికాదంటూ ఆయన సన్నిహితులు హితవచనాలు చెబుతున్నారు. ఇతర రాజకీయ పక్షాలు సైతం రాజయ్య ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నాయి. ఆయన సన్నిహితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఎదురుదెబ్బతిన్న రాజయ్య మాత్రం చాలా జాగ్రత్తగా ఒక్కో అడుగు వేస్తున్నట్లు భావిస్తున్నారు.

తనకు టికెట్ ఇవ్వకపోవడం పై నైతిక మద్ధతును కూడగడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మాదిగ ఓటర్లను తన వైపు నిలబడే విధంగా పావులు కదుపుతున్నారు. మరో వైపు అనుచరులు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో రాజయ్య ఒక మెట్టెక్కారని భావించవచ్చు. ప్రస్తుతానికి నిన్నమొన్నటి వరకు రాజయ్యకు మద్ధతుగా ఆయన అనుచరులు తప్ప ఇతరులెవరూ స్పందించలేదు.

మాదిగల మద్ధతు కూడగట్టే యత్నం

రాజయ్యకు అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించిన ఈ ఆపద సమయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రంగప్రవేశం చేయడం వల్ల రాజయ్య నైతిక స్థైర్యం పెరిగింది. రాజయ్యకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కృష్ణ మాదిగ బహిరంగంగా మద్ధతు పలికారు. రాజయ్యకు అన్యాయం జరిగిందని చెప్పడమే కాకుండా, కేసీఆర్ సైతం అన్యాయం చేశారని విమర్శించారు.

ఈ వ్యవహారంలో కడియం శ్రీహరిని కుట్రదారునిగా అభివర్ణించడమే కాకుండా ఆయనను గుంటనక్కగా పోల్చడం గమనార్హం. మాదిగలను ఎదగనీయకుండా కడియం అడ్డుకుంటున్నారని విమర్శించారు. మరో వైపు స్టేషన్ ఘన్ పూర్ లో మాదిగల ఆత్మగౌరవ సభ పెట్టి పూర్తి అండగా నిలిచారు. మాదిగలు సంఘటితం కావాలని పిలుపు నిచ్చారు. రాజయ్యకు అండగా నిలవాలని కోరారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో దాదాపు 70వేల మందికి పైగా మాదిగల ఓట్లు ఉండడం గమనార్హం.

రాజయ్య మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికాగా, కడియం మాదిగ ఉప కులమైన బైండ్ల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ కారణంగా కృష్ణ మాదిగ బహిరంగ మద్ధతును అందించారు. అంతే కాకుండా రాజయ్య పై సర్పంచ్ నవ్య చేసిన లైంగిక ఆరోపణల వ్యవహారాన్ని సైతం లేవనెత్తారు. మహిళా కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించడం పట్ల స్పందించారు. భూపాలపల్లి, రామగుండం ఎమ్మెల్యేల పైన లైంగిక ఆరోపణలు వచ్చినా వారికి టికెట్ ఇచ్చి రాజయ్యకు ఎందుకు నిరాకరించారంటూ ప్రశ్నించడం గమనార్హం. దీంతో రాజయ్యకు మద్ధతు అందించే శక్తులు ఏకమవుతున్నాయి.

కలకలం సృష్టిస్తున్న రాజయ్య ప్రకటనలు

బీఆర్ఎస్ ప్రకటించిన లిస్టులో మార్పులుంటాయనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో తనకు అవకాశం వస్తుందనే రాజయ్య విశ్వాసం ప్రకటిస్తున్నారు. కడియం శ్రీహరిని మార్చి తిరిగి తనకే తప్పకుండా చాన్స్‌ లభిస్తుందని బలంగా నమ్ముతున్నారు. తాను తప్పకుండా ప్రజల మధ్య ఉంటానంటూ స్పష్టం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన పద్ధతిలో తన అభిప్రాయాలను తేల్చిచెబుతున్నారు.

మొట్టు తీసి, దుక్కిదున్ని, పంట పండించి, కుప్ప పోసి, ఆ రాశి మీదెవరో వచ్చి కూర్చుంటానంటే ఎలా? చూస్తూ ఉంటామంటూ ఆవేదనతో కూడిన అగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. తానుండగా వేరెవరికో టికెట్ ఇస్తే ఎలా ఊరుకుంటామంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ పై తనకు నమ్మకం ఉందంటూనే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా, తన త్యాగాలను గుర్తు చేస్తున్నారు. టికెట్ రాని సమయంలో ఆయన బోరున విలపించడం, ఆయన తీవ్ర మనస్థాపానికి గురి కావడం తదితర సంఘటనల నేపథ్యంలో రాజయ్య పట్ల క్రమంగా సానుభూతి పెరుగుతోందని చెబుతున్నారు.

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నందున నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలతో చుట్టేస్తూ తన పలుకుబడి తగ్గకుండా జాగ్రత్తవహిస్తున్నారు. ఏమైనా రాజయ్య ప్రస్తుతం అప్రమత్తతో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఆయన పార్టీ మారుతారని? తన పూర్వ పార్టీ కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగుతోంది. తప్పకుండా పోటీలో ఉండేవిధంగా పూర్వరంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారని భావిస్తున్నారు.

కొద్ది రోజులు వేచిచూసి అభ్యర్ధి మార్పు ఉండకపోతే తన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అప్పటి వరకు జాగ్రత్తగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. కాగా ప్రకటించిన టికెట్ మార్పు ఉండకపోతే మీ పయనమెటని రాజయ్యను ప్రశ్నిస్తే కాలమే నిర్ణయిస్తుందంటూ వేదాంత ధోరణి ప్రదర్శిస్తున్నారు. దీనికి ప్రతిగా కడియం సైతం తనదైన పద్ధతిలో ఎత్తులు వేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంతో స్టేషన్ గులాబీ రాజకీయం మరింత రసకందాయంలో పడ్డాయంటున్నారు.

Latest News