WhatsApp | ఇన్‌స్టంట్ మెస్సెజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ సరికొత్త అప్‌డేట్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయం ఇకపై హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలను షేర్ చేసేందుకు వీలుంది. 4096 x 2692 ఫిక్సల్ సైజ్ ఫొటోలను షేర్ చేసుకోవచ్చు వాట్సాప్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం తీసుకువస్తూ ఉంటుంది.
ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను పరిచయం చేసింది. అయితే, తాజాగా హెచ్‌డీ ఫొటోలను సైతం షేర్ చేసేకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు జుకర్ బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘వాట్సాప్‌లో ఫొటోలను షేరింగ్‌లో కొత్త అప్‌డేట్ వచ్చింది. ఇకపై మీరు హెచ్‌డీ ఫొటోలను షేర్ చేసుకోవచ్చని తెలిపారు.
రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్‌ప్లాట్ ఫామ్ యూజర్లందరికీ అప్‌డేట్‌ను ఇవ్వనున్నది. అయితే, ఈ అప్‌డేట్‌తో ఇకపై హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలను పంపించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఒరిజినల్ సైజ్‌తో పోలిస్తే.. ఇమేజ్ కొంత కంప్రెస్ కానున్నట్లు సమాచారం.
ఇమేజ్‌ను షేర్ చేసే సమయంలో.. ఇమేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో అది హెచ్‌డీ క్వాలిటీ అని తెలిసేందుకు ఇమేజ్‌పై ఓ ఐకాన్ కూడా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నది. దాంతో పాటు త్వరలో హెచ్‌డీ వీడియోలను సైతం షేర్ చేసుకునే అప్‌డేట్‌ను సైతం తీసుకురానున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ వివరించారు.