Site icon vidhaatha

క‌రోనా ఎఫెక్ట్‌: చైనాలో తెల్ల కాగిత విప్లవం!

విధాత: చైనాలో మరో విప్లవం! అది ఏ4 తెల్లకాగిత విప్లవం. తెల్లకాగితాలతో ప్రజలు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనోద్యమాన్ని చేపట్టారు. కరోనా కారణంతో నెలల తరబడి విధిస్తున్నలాక్‌డౌన్‌కు నిరసనగా ప్రజలు రోడ్లమీదికి వస్తుంటే చైనా ప్రభుత్వం తీవ్రంగా అణిచివేస్తున్నది. ఏ రూపంలో నిరసన వ్యక్తం చేసినా చైనా పాలకులు నిర్బంధ కాండ అమలు చేస్తున్నారు. దీంతో ఈ సారి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తెల్లకాగితం చేతబట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తెల్ల కాగితం అమ్మ‌కాల‌పై నిషేధం.. 80వేల దుకాణాల మూత‌

తెల్ల కాగితం నిరసనోద్యమానికి ప్రతీక కావటం అందరినీ ఆలోచింప చేస్తున్నది. చెప్పటానికీ, మాట్లాడటానికీ అవకాశం లేదన్న సంకేతాన్ని ప్రపంచానికి చాటుతున్నది. దీంతో చైనా పాలకులు తెల్లకాగితం అమ్మకాలపైనే నిషేధం విధించినట్లు తెలుస్తున్నది. చైనాలో అతిపెద్ద తెల్లకాగిత సరఫరా కంపెనీ తన 80వేల దుకాణాలను మూసేసింది. నిజానికి గతంలో 2020లో హాంకాంగ్‌లో జరిగిన నిరసనోద్యమంలో మొదటి సారి తెల్ల కాగితాన్ని ప్రదర్శించారు. ఇప్పుడది చైనాలో నిరసన ప్రతీక అయ్యింది.

లాక్‌డౌన్‌కు వ్య‌తిరేకంగా పోలీసుల‌పై తిరుగుబాటు

గత సెప్టెంబర్‌లో ఓ క్వారంటైన్‌ బస్సు ప్రమాదంలో 27 మంది మృత్యువాత పడ్డారు. ఝాంఝాలో కార్మికులు లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా పోలీసులపైనే తిరగబడ్డారు. ఇటీవల షింజియాంగ్‌ ఉరుంకి నగరంలో ఓ అపార్ట్‌మెంటులో 10మంది చనిపోయారు. క్వారైంటైన్‌ కారణంగా ఇండ్లలోని వారు బయటకు రాకుండా పోలీసులు బయటి నుంచి తాళాలు వేయటంతోనే ఆ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఆ అపార్ట్‌మెంటులో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా వారు చనిపోయినట్లు తెలుస్తున్నది.

చైనా ప్ర‌జ‌ల్లో తీవ్ర నిర‌స‌న‌

తార్‌లో ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు జరుగుతున్నసందర్భంలో కూడా లక్షలాదిగా ప్రజలు ఎలాంటి మాస్కులు లేకుండా వీక్షిస్తున్నారు. దేశ దేశాల్లో కూడా ప్రజలు కొవిడ్‌ను జయించి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయినా చైనాలో గత మూడు నెలలుగా లాక్‌ డౌన్‌ ప్రకటిస్తుండటం పట్ల చైనా ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. చైనాలోని ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ తెల్లకాగితం ఏ4 ఉద్యమంలో ముందు భాగాన ఉన్నారు.

జిన్‌పింగ్‌కు భ‌విష్య‌త్ అంధ‌కారమే..

మూడో సారి అధికారం చేపట్టిన జిన్‌పింగ్‌కు ఇటీవల అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. జీవితకాలం అధినేతగా ప్రకటించుకున్న జిన్‌పింగ్‌కు భవిష్యత్‌కాలం అంధకారంగానే పరిణమించనున్నది. చైనాలో తీన్‌మెన్‌ స్కైర్‌ విద్యార్థి ఉద్యమం తర్వాత ఇదే అతిపెద్ద ఉద్యమం.

Exit mobile version