- ఉగ్ర కుట్రలో పాక్ హస్తం
- పాత్రధారులందరూ హతం
- చిక్కిన కసబ్ కు ఉరి
- ఏటీఎస్ అధికారి హేమంత్ కర్కరే మృతిపై అనుమానాలు
- నేటికీ మిగిలే ఉన్న ప్రశ్నలు
- కర్కరే మృతిలో హిందూ ఉగ్రవాదుల హస్తం ఉన్నదా!
విధాత: ముంబాయి మారణహోమానికి 14 ఏండ్లు. 26/11 గా పిలుస్తున్నఈ ఉగ్రదాడితో దేశమే కాదు, ప్రపంచమంతా ఉలిక్కి పడింది. ఏకంగా 60 గంటలు ముంబాయి నగరంలో టెర్రరిస్టులు మారణాయుధాలతో మారణ కాండ సృష్టించారు. మొత్తం 224 మంది చనిపోయారు. ఈ దాడిలో నేరుగా పాల్గొన్న ముష్కరులంతా మన భద్రతా బలగాల ఆపేరషన్‌లో మట్టికరిచారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కసబ్ పాకిస్థాన్ పౌరుడని విచారణలో తేలింది. తగిన సాక్ష్యాధారాలతో కసబ్ ఉరి తాడుకు వేలాడాడు.
ముంబాయి టెర్రరిస్టు దాడిలో 14 దేశాలకు చెందిన సాధారణ పౌరులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ప్రజలను రక్షించే కర్తవ్య నిర్వహణలో 18మంది భద్రతా సిబ్బంధి కూడా అసువులు బాశారు. ఇందులో ఏటీఎస్ అధికారి హేమంత్ కర్కరే కూడా కన్నుమూయటం అందరినీ కలిచి వేసింది. అయితే అత్యున్నత అధికారి అయిన కర్కరేకు తగిలిన తుపాకీ తూటాలు, పోస్టుమార్టం రిపోర్టు వెలుగు చూసిన తర్వాత అతని మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. కర్కరే భార్య అయితే తన భర్త మృతిలో హిందూ తీవ్రవాదుల హస్తం ఉందేమోననే అనుమానాలు వ్యక్తం చేయటం గమనార్హం.
కర్కరే మృతిపై పోస్టుమార్టమ్ రిపోర్టు అనేక కొత్త కోణాలను ఆవిష్కరించింది. కర్కరేకు ఛాతిపై భాగాన మూడు బుల్లెట్లు దిగాయి. అత్యున్నత అధికారి అయిన కర్కరే రక్షణ నియమాలు పాటించకుండా ఆపరేషన్‌లో పాల్గొంటాడా? రక్షణ నియమాలు తెలిసిన అతినికి ఛాతి పై భాగంలో బుల్లెట్లు తగిలే అవకాశాలు అసలే ఉండవు, అలాంటప్పుడు అలా ఎలా తగిలాయి? ఆపరేషన్‌లో పాల్గొనేటప్పుడు కర్కరే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటాడు కదా, అది ఎందుకు వేసుకోలేదు? వేసుకుంటే అది ఏమైంది?.
నిజానికి కర్కరే ఆ రోజు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నట్లు తెలుస్తున్నది. ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరూ ఆ జాకెట్లు వేసుకున్నారు. కర్కరే ఒక్కడే వేసుకోకుండా ఆపరేషన్‌లో పాల్టొన్నాడంటే నమ్మేదెలా? అలాగే తీవ్ర గాయాల పాలైన కర్కరేను గాయాలు తగిలిన తర్వాత 40 నిమిషాల దాకా అతని దగ్గరికి ఎవరూ వెళ్లలేదు. గాయాలతో అలాగే పడి ఉన్నాడని అంటున్నారు? అలా ఎందుకు జరిగింది. సహచర పోలీసు ఉద్యోగులు ఏమయ్యారు, ఏం చేశారు? ఇలాంటి ప్రశ్నలెన్నో కర్కరే మృతిపై అనేక అనుమానాలను ముందుకు తెస్తున్నాయి.
ఇక్కడే కర్కరే గురించిన మరో విషయం చెప్పుకోవాలి. ఇంతకు నెల ముందే.. అంటే 2008 సెప్టెంబర్ 9న గుజరాత్, మహారాష్ట్రలో జరిగిన బాంబు దాడి కేసు గురించి తెలుసుకోవాలి. గుజరాత్ లోని మోదాస, మహారాష్ట్రలోని మాలేగాంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 8మంది చనిపోయారు. ఈ పేలుళ్ల కేసు దర్యాప్తును చేపట్టిన కర్కరే అనేక కొత్త కోణాలను బయట పెట్టారు. ఈ కేసు పరిశోధనలో టెర్రరిస్టులు ఉపయోగించిన ఓ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నాడు.
అది ఎవరికి చెందినదో తెలుసుకునే క్రమంలో అది మధ్యప్రదేశ్ భూపాల్‌కు చెందిన బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దని తేలింది. ఆ క్రమంలో లోతైన విచారణ చేపట్టిన కర్కరే మాలేగాం పేలుళ్లకు హిందూ తీవ్రవాదులే కారణమని తేల్చారు. అందుకు బాధ్యులుగా ఉన్నత స్థానాల్లో ఉన్న బీజేపీ కీలక నేతలుగా గుర్తించారు. అరెస్టులు ప్రారంభించారు. ఇది ఎక్కడి దాకా పోతుందోనని బీజేపీ నేతలకు దిగులు పట్టుకుంది.
దీంతో కర్కరే దర్యాప్తుపై బీజేపీ నేతలు కన్నెర్ర జేశారు. ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో ఆ దర్యాప్తు నత్తనడక నడిచి నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలో ముంబాయి టెర్రర్ దాడి జరిగి అందులో కర్కరే చనిపోవటం యాధృచ్చికమేనా అన్నది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికీ ముంబాయి దాడి , కర్కరే మృతిపై అనేక అనుమానాలు, చిక్కుముడులున్నాయి. ఇవన్నీ ఎప్పటికి వెలుగుచూసేనో….